కఠ్మాండు: నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెలువడిన 50 సీట్ల ఫలితాల్లో ఈ పార్టీ 45 సీట్లు గెలుచుకుంది. మరో 95 చోట్ల భారీ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ విజయంతో నేపాల్ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. యువనేత, కఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మాజీ రాపర్ అయిన ఇతను అవినీతి, బంధుప్రీతి, రాజకీయ అస్థిరతపై పాటలు పాడి నేపాల్‌లో బాగా ఫేమస్ అయ్యారు. 2022లో జరిగిన కఠ్మాండు మేయర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. 2022లో రవి లామిచానే అనే వ్యక్తి స్థాపించిన ఆర్ఎస్పీలో రెండు నెలల క్రితం చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఝాపా-5 నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై పోటీ చేసిన బాలేంద్ర షా (బాలెన్) -52,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు చిత్వాన్–2 నుంచి ఆర్‌ఎస్‌పీ అధ్యక్షుడు రవి లామిచానే భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్పీ కఠ్మాండు జిల్లాలో పదికి పది స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. భక్తపూర్‌లో 2, లలితపూర్‌లో ఒక సీటు గెలిచింది. మాధేశ్ ప్రావిన్స్‌లోని 32 సీట్లలో ఇప్పటి వరకు ఏడు గెలుచుకొని.. 23 చోట్ల ముందంజలో ఉంది. ప్రపోర్షనల్ ఓటింగ్‌లో కూడా ఆర్ఎస్పీ 57 శాతం ఓట్లతో ఆధిక్యం సాధించింది. కాగా, మార్చి 9వ తేదీ వరకు పూర్తి ఫలితాలు వెల్లడవనున్నాయి.
