న్యూఢిల్లీ: రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేసే విషయంలో తమకు ఎవరికీ అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. చమురును కొనుగోలు చేయడానికి ఇండియా ఏ దేశం అనుమతిపైనా ఆధారపడలేదని తెలిపింది. రష్యా చమురును కొనడానికి ఇండియాకు 30 రోజుల తాత్కాలిక మినహాయింపునిచ్చామని అమెరికా అనడంతో ఇండియా ఘాటుగా బదులిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. “రష్యా చమురును కొనడానికి భారత్ ఏనాడూ ఏ దేశం అనుమతి కోరలేదు. భవిష్యత్తులోనూ కోరదు. జాతీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం. 2026 ఫిబ్రవరి నాటికి కూడా భారత్‌కు రష్యానే అతిపెద్ద ముడిచమురు సప్లయర్‌గా ఉంది. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చమురును భారత్ దిగుమతి చేసుకుంటూనే ఉంది”అని వెల్లడించింది.
అమెరికా మినహాయింపు వల్లే చమురును ఇండియా కొనుగోలు చేస్తుందన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ‘‘హార్మూజ్ మార్గంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, భారత్ ఇంధన సరఫరా సురక్షితంగా, స్థిరంగా ఉంది. భారత్ ముడిచమురును గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం 40 దేశాలకు దాన్ని విస్తరించింది. తద్వారా అనేక ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను ఏర్పాటు చేసుకుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలు ఎక్కడ లభిస్తే అక్కడ నుంచే భారత్ చమురును కొనుగోలు చేస్తుంది”అని కేంద్రం పేర్కొంది.
