రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు

రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు
  • వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటింది: మోదీ
  • కోటాలో 1,500 కోట్లతో నిర్మించే కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన 
  • ఓం బిర్లా అద్భుతమైన స్పీకర్ అని ప్రధాని కామెంట్

జైపూర్: వెస్ట్ బెంగాల్  లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకడంలో  ప్రొటోకాల్ ఉల్లంఘనపై   వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సంతాల్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ముని ఆహ్వానించడానికి సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర మంత్రులు వెళ్లకపోవడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఒక గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానం సిగ్గుచేటని, ఇది దేశ ప్రజలందరినీ బాధించిందని మండిపడ్డారు.  టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయ పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు. బెంగాల్ ప్రభుత్వానికి ఇకనైనా మంచి బుద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

ఓం బిర్లా అద్భుతమైన స్పీకర్

లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వేళ ఆయనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఓం బిర్లా అద్భుతమైన స్పీకర్ అని అభివర్ణించిన మోదీ..ఆయన పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని, సభలోని అందరినీ కలుపుకుని పోతారని కొనియాడారు. శనివారం ప్రధాని మోదీ రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని కోటాలో  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. " ఓం బిర్లాజీ మంచి ఎంపీ. అద్భుతమైన లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్. రాజ్యాంగం పట్ల పూర్తి అంకితభావంతో ఉంటారు. సభలోని అందరికీ కుటుంబ పెద్దలా వ్యవహరిస్తారు. కొందరి చేదు మాటలను కూడా చిరునవ్వుతో భరిస్తారు"  అని వ్యాఖ్యానించారు. కాగా, బిర్లాపై ప్రతిపక్షాల  అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న చర్చ జరగనుంది.

రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు కోటా అభివృద్ధి కేంద్రమైతది..

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని కోటాలో సుమారు రూ. 1,500 కోట్లతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని వర్చువల్‌‌‌‌‌‌‌‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటా ప్రాంతం రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఓ ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుందన్నారు. 2014నాటికి దేశంలో కేవలం 70 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని.. గడిచిన 11 ఏండ్లలో  ఆ సంఖ్య 160 దాటిందని గుర్తుచేశారు. 

తక్కువ ధరకు మెడిసిన్స్ ఇవ్వడమే లక్ష్యం

జనౌషధి పరియోజనతో ప్రతి పౌరుడికి నాణ్యమైన మెడిసిన్లకు తక్కువ ధరకు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. 'జనౌషధి దివస్' సందర్భంగా శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. "జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. బ్రాండెడ్ మందులతో పోలిస్తే ఇక్కడ 50% నుంచి 80% తక్కువ ధరకే నాణ్యమైన మెడిసిన్స్ లభిస్తున్నాయి" అని పేర్కొన్నారు.