న్యూఢిల్లీ: భారతదేశ ఎదుగుదల అన్‌స్టాపబుల్ అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. భారత్ ఎవరి గుప్పిట్లో లేదని.. తన అభివృద్ధి మార్గాన్ని సొంతంగానే నిర్మించుకుంటున్నదని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో జరిగిన 'రైసినా డైలాగ్' సదస్సులో మాట్లాడారు."మేం ఎవరి దయాదాక్షిణ్యాల మీదో లేదా ఇతరుల పొరపాట్ల మీదో ఆధారపడి అభివృద్ధి చెందడం లేదు. మా సొంత బలాబలాల మీద ఆధారపడే ఎదుగుతున్నాం. భారత్ తో కలిసి పనిచేసేవారు ప్రయోజనాలు పొందుతారు" అని అన్నారు.
ఇరాన్ నౌకకు ఆశ్రయమిచ్చాం..
ఈ నెల 4 వ తేదీనే ఇరాన్ నౌక 'ఐఆర్ఐఎస్ లావన్'కు కొచ్చి ఓడరేవులో ఆశ్రయమిచ్చామని జైశంకర్ వెల్లడించారు. "ఐరిస్ లావన్ అనే ఇరాన్ నౌకలో తిరిగి తన దేశానికి వెళ్తుండగా అందులో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో నౌకను కొచ్చిలో అత్యవసర నిలుపుదలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఈ నెల 1న అనుమతిచ్చాం. దీంతో నౌకను ఇరాన్ ఈ నెల 4న కొచ్చిలో నిలిపింది. అందులోని 183 మంది సిబ్బందికి కొచ్చిలోనే ఆశ్రయమిచ్చాం. అమెరికా.. ఇరాన్ ఫ్రిగేట్ 'ఐఆర్ఐఎస్ దేనా'ను ముంచేయడానికి కొన్ని రోజుల ముందే భారత్ 'ఐఆర్ఐఎస్ లావన్' నౌకకు అనుమతిచ్చింది" అని అన్నారు.
