ప్రాంతీయ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) శనివారం అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. హార్మూజ్ జలసంధి వద్ద యూఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నట్టు పేర్కొన్నది. జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు.
దీనికి స్పందిస్తూ ఐఆర్‌జీసీ ఈ హెచ్చరికలు చేసింది. ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌కు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇటీవల చమురు నౌకలపై తాము చేసిన దాడినికూడా మర్చిపోవద్దని తెలిపారు.
