రవి ఐదో తరగతి చదువుతున్నాడు. ఒక రోజు స్కూలు పక్కగా ఉన్న స్టేషనరీ షాప్‌కు వెళ్లాడు. షాపు అతనికి పది రూపాయలు ఇచ్చి పెన్ కావాలన్నాడు. అప్పటికే కావలసినవి కొనడానికి అయిదుగురు ఉన్నారు. వారికి ఇచ్చాక “నీకేం కావాలి” అని రవిని అడిగాడు షాపు అతను. “అంకుల్ నాకు పెన్ కావాలి” అన్నాడు రవి. పెన్ ఇచ్చి “పది రూపాయలు ఇవ్వు” అన్నాడు షాపు అతను. “ఇందాకే మీకు పది రూపాయలు ఇచ్చాను” అన్నాడు రవి. అప్పుడే ఒక పెద్ద మనిషి వచ్చాడు.
“పెన్ తేరగా రాదు.. పది రూపాయలు ఇచ్చి తీసుకెళ్లు” అన్నాడు షాపు అతను.“అంకుల్ నేను అబద్ధం చెప్పడం లేదు మీకు ముందుగానే పది రూపాయలు ఇచ్చాను” అన్నాడు రవి. “ఆ అబ్బాయి ఇచ్చానని చెబుతున్నాడు కదా?” అన్నాడు ఆ పెద్దమనిషి. “లేదు సార్.. ఇలా అబద్ధాలు చెప్పి పెన్ తీసుకుని, పెన్ కోసం తెచ్చిన డబ్బులతో తినడానికి ఏదైనా కొనుక్కుంటారు. ఇలాంటివి చాలా జరిగాయి” అన్నాడు యజమాని.
“సరే లెండి.. ఈ పది రూపాయలు తీసుకుని అతనికి కావలసిన పెన్ ఇవ్వండి” అన్నాడు ఆ పెద్దాయన. రవి పెన్ తీసుకుని “థాంక్స్ అంకుల్.. మీరు ఇచ్చిన పది రూపాయలు మీకు తిరిగి ఎలా ఇవ్వాలి” అన్నాడు. “ఇలా ఈ షాపులో కలసినప్పుడు ఇద్దువులే.. చూడు బాబు ఇక మీదట వస్తువు తీసుకున్న తరువాతనే డబ్బులు ఇవ్వు” అన్నాడు ఆ పెద్ద మనిషి. “అలాగే అంకుల్.. ఇక మీదట అలాగే చేస్తాను” అన్నాడు రవి.
స్కూలుకు వెళ్ళాక తన తరగతి మిత్రులకు జరిగింది చెప్పాడు రవి. “ఆ అంకుల్ చెప్పినట్టు మనం వస్తువు తీసుకున్న తరువాతనే డబ్బులు ఇవ్వాలి” అన్నాడు రమేష్ అనే మిత్రుడు. “అవును” అన్నారు మిగతా మిత్రులు. ఒక వారం తరువాత రవి అదే షాపులో ఒక నోట్ బుక్, ఒక పెన్ కావాలి అని అడిగాడు. అదే సమయానికి ఆ పెద్ద మనిషి కూడా వచ్చాడు “నమస్తే అంకుల్” అన్నాడు రవి.
“నమస్తే బాబు ఎలా ఉన్నావు?” అన్నారు ఆయన. “బాగున్నాను అంకుల్” అన్నాడు రవి. షాపు అతను నోట్ బుక్,పెన్ ఇచ్చి “ముప్ఫై రూపాయలు అయ్యింది” అన్నాడు యజమాని. “అంకుల్ ఇదిగోండి” అని యాభై రూపాయలు ఇచ్చాడు. వేరే వారికి కావలసినవి ఇచ్చి రవికి డెబ్బై రూపాయలు తిరిగి ఇచ్చాడు యజమాని. “అంకుల్ నేను యాభై రూపాయలే ఇచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు” అన్నాడు రవి. “థాంక్స్ బాబు” అని ఇరవై రూపాయలు ఇచ్చాడు షాపు అతను.
“చూశారా.. పిల్లవాడి నిజాయితీ ఆరోజు మీరు పది రూపాయలు ఇవ్వలేదు అన్నారు” అన్నాడు ఆ పెద్దాయన. షాపు అతను “తప్పయ్యింది సార్!” అని “ఇదిగో బాబు పది రూపాయలు” అని రవికి ఇచ్చాడు. రవి ఆ పది రూపాయలు తీసుకుని ఆ పెద్ద మనిషికి ఇచ్చి“థాంక్స్ అంకుల్” అని చెప్పి స్కూలుకు వెళ్లిపోయాడు.
- యు. విజయశేఖర రెడ్డి-
