ప్రజారవాణాపై తుఫాన్‌‌ ఎఫెక్ట్

ప్రజారవాణాపై   తుఫాన్‌‌ ఎఫెక్ట్
  • భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు..కొన్నింటికి రీషెడ్యూల్​
  • ఆయా స్టేషన్లలో ప్రయాణికుల అరిగోస

హైదరాబాద్ సిటీ/వరంగల్​, వెలుగు: ప్రజా రవాణాపై మొంథ తుఫాన్‌‌ ఎఫెక్ట్‌‌ పడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు రీషెడ్యూల్​చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల వల్ల పలుచోట్ల రైలు మార్గాలు ప్రమాదకరంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.  ప్రధానంగా సికింద్రాబాద్ డివిజన్‌‌లోని  మహబూబాబాద్ - –డోర్నకల్ --– ఖమ్మం సెక్షన్ల మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని స్టేషన్లలో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. దీనివల్ల  కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటు కొన్నింటిని రీషెడ్యూల్ చేశామని చెప్పారు.

వరంగల్‌‌లో ప్రయాణికులకు ఇబ్బందులు

ఉమ్మడి వరంగల్‍ జిల్లా పరిధి వరంగల్‍, మహబూబాబాద్‍, డోర్నకల్‍, గార్ల రైల్వే స్టేషన్లలోని పట్టాల మీదకు వరద నీరు చేరింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వరంగల్‍ స్టేషన్‍ వద్ద ఇంటర్‍ సిటీ, ఈస్ట్​కోస్ట్, మహబూబాబాద్‍ స్టేషన్‌‌లో కృష్ణా ఎక్స్​ప్రెస్, డోర్నకల్‍లో గోల్కొండ ఎక్స్​ప్రెస్​, గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్​లో కోణార్క్ ఎక్స్​ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కాగా, సికింద్రాబాద్‍ నుంచి విశాఖ పట్నం వెళ్లే గరీబ్‍రథ్‌‌తోపాటు పలు రైళ్లను రద్దు చేశారు. ఓవైపు భారీ వానలు, మరోవైపు రైళ్లు రద్దు కావడంతో పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అరిగోస పడ్డారు. కొందరు స్టేషన్లలోనే సేద తీరగా..మరికొందరు ప్రత్యామ్నాయ ప్రయాణం కోసం నానా అవస్థలు పడ్డారు.  కాగా, రైళ్లకు సంబంధించిన సమాచారం కోసం డివిజన్‍ స్థాయి స్టేషన్లలో హెల్ప్ లైన్‍ నంబర్లు ఏర్పాటు చేశారు. . రైళ్ల రద్దు, పాక్షిక రద్దు, మళ్లింపు, రీషెడ్యూల్‍ లాంటి  సమాచారం కోసం http://scr.indianrailways.gov.in/ వెబ్‍సైట్‌‌ను చూడాలని సూచించారు.

ఏపీకి వెళ్లే 94 ఆర్టీసీ సర్వీసుల రద్దు

మొంథా తుఫాను నేపథ్యంలో హైదరాబాద్‌‌ నుంచి ఏపీకి వెళ్లే 94 బస్ సర్వీసులను బుధవారం అధికారులు రద్దు చేశారు. నగరం నుంచి విజయవాడ , ఒంగోలు, మార్కాపురం,అనంతపురం, నంద్యాల, కాకినాడ, విశాఖ పట్నం,తాడిపత్రి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన  సర్వీసులను రద్దు చేసినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.  పొరుగు రాష్ట్రానికి వెళ్లే 50 శాతం బస్సులు రద్దయ్యాయని  అధికారులు తెలిపారు. గురువారం కూడా పరిస్థితులను బట్టి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.