స్టాక్ మార్కెట్లు భారీగా లాస్.. రూపాయి మళ్లీ నేలచూపులు

స్టాక్ మార్కెట్లు భారీగా లాస్.. రూపాయి మళ్లీ నేలచూపులు

ముంబై:  స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. విదేశీ నిధుల ప్రవాహం వెనక్కి వెళ్ళడం, రూపాయి మళ్లీ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 533 పాయింట్లు నష్టపోయి 84,679 పాయింట్ల వద్ద స్థిరపడింది.  నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతో  25,860.10 వద్ద ముగిసింది. ఇది ఈ వారంలోనే అత్యల్ప స్థాయి! సెన్సెక్స్ కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా ఐదు శాతం మేర నష్టపోయాయి. ఎటర్నల్, హెచ్​సీఎల్​ టెక్ బజాజ్ ఫిన్​సర్వ్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల బాటలో నడిచాయి.   టైటాన్,  ఎయిర్​టెల్, ఎం అండ్​ ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రం లాభపడ్డాయి.  రంగాలవారీగా చూస్తే రియాల్టీ సూచీ అత్యధికంగా నష్టపోగా, బ్యాంకెక్స్, కమోడిటీస్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ రంగాలు కూడా డీలాపడ్డాయి. కేవలం టెలికమ్యూనికేషన్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు లాభపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 2,519 షేర్లు నష్టపోగా, 1,651 లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా హాంగ్ కాంగ్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్​ధర 59.63 డాలర్లకు తగ్గింది. ఎఫ్​ఐఐలు సోమవారం దాదాపు రూ. 1,468.32 కోట్ల  విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1,792.25 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

రూపాయి.. మళ్లీ నేలచూపులు  

  
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం రికార్డు స్థాయికి పడిపోయింది. 23 పైసలు పతనమై 90.93 వద్ద ముగిసింది. ఒకదశలో 91.14 స్థాయికి కూడా చేరుకుంది.  అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, ఎఫ్​ఐఐల నిధులు వెళ్లిపోతూనే ఉండటం దీనికి ప్రధాన కారణాలు.  చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ రూపాయి పతనం ఆగలేదు. గత పది రోజుల్లోనే దీని విలువ 90 నుంచి 91 స్థాయికి పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెలలోనే  92 స్థాయిని దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా  నూతన వాణిజ్య ప్రతిపాదనలకు ఇండియా ఒప్పుకోకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించిందని, ఆర్​బీఐ జోక్యం చేసుకోకపోతే రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని అంటున్నారు.