- ఆసిఫాబాద్ జిల్లా బాలాజీ అనుకోడలో ఇంటింటికీ తిరిగిన ఓడిన క్యాండిడేట్
కాగజ్‌నగర్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ క్యాండిడేట్.. తాను పంచిన డబ్బులను తిరిగి వసూలు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ.. తనకు ఓటు వేసినట్లు పసుపు బియ్యం పట్టుకొని ప్రమాణం చేయాలని.. లేదంటే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన వగాడి శంకర్ సర్పంచ్ క్యాండిడేట్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో మంగళవారం తన భార్యతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేసిన వాళ్లు పసుపు బియ్యం పట్టుకోవాలని.. లేని వాళ్లు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు గ్రామానికి చేరుకొని.. శంకర్‌కు నచ్చజెప్పి పంపించారు.
