
- పలు జిల్లాల్లో నీటమునిగిన కాలనీలు
- ఉప్పొంగిన వాగులు.. ఊర్లకు రాకపోకలు బంద్
- వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- వరదల్లో కొట్టుకపోయి నలుగురి మృతి
- ప్రాజెక్టుల్లోకి పెరిగిన ఇన్‌ఫ్లో
- గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు
- కొత్తగూడెంలో అత్యధికంగా 19.98 సెంటీమీటర్ల వాన
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆగకుండా కురుస్తున్నాయి. వరదలకు పలు జిల్లాల్లో టౌన్లు, గ్రామాలు జలమయమవుతున్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, కొత్తగూడెం, పాల్వంచ తదితర పట్టణాల్లో వందలాది కాలనీలు నీటమునిగాయి. బియ్యం, నిత్యావసర సరుకులు తడిసిపోయి బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే నిండిన చెరువులు ఈ సీజన్లో మూడోసారి మత్తళ్లు దుంకుతున్నాయి. సోమవారం వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయి ఏడేండ్ల చిన్నారి సహా నలుగురు చనిపోయారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం వికలాంగ కాలనీలో ఏడేళ్ల చిన్నారి వరదనీటిలో కొట్టుకుపోయి మృతిచెందింది. శనగ రవి, నాగమణి కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. వారి పిల్లలు మణికంఠ, అంజలి (7) వర్షంలో ఆడుకుంటుండగా గుట్టపై నుంచి ఒక్కసారిగా వరద వచ్చింది. దీంతో డ్రైనేజీ ఉప్పొంగి పిల్లలిద్దరూ కొట్టుకపోయారు. అక్కడే ఉన్న ఓ మహిళ మణికంఠను కాపాడగా, అంజలి డ్రైనేజీ లో దాదాపు అర కిలోమీటర్ కొట్టుకుపోయిఊపిరాడక చనిపోయింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో ఈద్గులపల్లి చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయి వెంకట్ (44) అనే వ్యక్తి చనిపోయాడు. చెరువు మత్తడి వద్ద కొందరు చేపలు పడుతుండగా.. చూసేందుకు వెళ్లిన వెంకట్ కాలు జారి చెరువులో పడిపోయాడు. చేపలు పడుతున్న వారు వెంకట్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పెరుమాండ్ల బ్రిడ్జి వద్ద అతడి డెడ్‌బాడీ దొరికింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ప్రమాదవశాత్తు పడి ఆదివారం గల్లంతైన జై సింగ్, కిషన్ మృతి చెందారు. సోమవారం వారి మృతదేహాలు ఇబ్రహీంనగర్ వద్ద వాగులో గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత డెడ్‌బాడీలను బంధువులకు పోలీసులు అప్పగించారు.
ప్రాజెక్టులకు పెరిగిన వరద
భారీ వర్షాల వల్ల మరోసారి ప్రాజెక్టులకు వరద పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి 1,14,270 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 30 గేట్లు తెరిచి దిగువకు వదలుతున్నారు. ప్రాజెక్టులో 91 టీఎంసీలకు గాను 85 టీఎంసీలు మెయింటెయిన్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు 3 గేట్లు, గడ్డెన్న వాగు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,18,804 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 25 గేట్లు ఓపెన్‌చేసి దిగువకు విడిచిపెడుతున్నారు. లక్ష్మి బ్యారేజీకి 3.8 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 51 గేట్లను తెరిచి దిగువకు వదులుతున్నారు. లోయర్ మానేరు డ్యామ్‌లోకి మోయతుమ్మెద వాగు నుంచి 38,387 క్యూసెక్కులు, మిడ్ మానేరు నుంచి 7,014 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఆఫీసర్లు 16 గేట్లు ఎత్తి మొత్తం 46,801 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో 20 గేట్లు ఎత్తి లక్షా 7 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఐదు యూనిట్లలో 240 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కోయిల్ సాగర్ 5 గేట్లు, సంగంబండ 4 గేట్లు, రామన్ పాడు 3 గేట్లు ఎత్తారు. మూసీ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో పెరగడంతో ఐదు గేట్లను ఎత్తి 10,900 క్యూసెక్కులు వదలుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ కు 33,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో రెండు గేట్లను ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు.
జల దిగ్బంధం
కొత్తగూడెం జిల్లా పాతకొత్తగూడెంలో 17.4 సెంటీమీటర్లు, పాల్వంచ మండలం సీతారామపట్నంలో 16.4 సెంటీమీటర్లు, చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాల్వంచలోని 10కిపైగా కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోని నిత్యవసర వస్తువులు తడిసి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నీటమునగడంతో హైవేపై రాకపోకలు నిలిచాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 27 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్.. భద్రాచలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లా సంగెం మొండ్రాయి నుంచి పల్లారుగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మామిళ్ల రోడ్ కల్వర్టు వద్ద వరదలో నరేశ్ ఆనే వ్యక్తి బైక్ తో సహా కొట్టుకుపోతుండగా గ్రామస్తులు కాపాడారు. వరంగల్ సిటీలోని పలు కాలనీలు, నర్సంపేట టౌన్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిర్మల్ జిల్లా నర్సాపూర్, కుంటాల, సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్‌లో లోతట్టు కాలనీలు నీట మునిగాయి.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడీ వద్ద చింతలపాటి వాగు, రణవెళ్లి వాగు, బెజ్జుర్ మండలం సలుగుపల్లి తీగల ఓర్రె ఉప్పొంగడంతో చింతలమానేపల్లి, బెజ్జుర్, పెంచికల్ పేట్ మండలాలకు రాకపోకలు నిలిచాయి. చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి శివారులో పత్తి నీట మునిగింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహరిస్తున్నాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సరళసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడంతో సోమవారం సైఫన్లు తెరుచుకునే అవకాశం ఉంది. నారాయణపేట జిల్లా అడవి సత్యవరం వద్ద వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో కేఎల్ఐ బ్రాంచ్కెనాల్స్కు మూడు చోట్ల గండ్లు పడ్డాయి.
భారీ వర్షానికి కరీంనగర్‌లోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర షాపుల్లోకి వరద నీరు వచ్చాయి. స్మార్ట్ సిటీ పనులు అధ్వానంగా చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు ధర్నా చేపట్టారు.
మెదక్ పట్టణం గాంధీనగర్ కాలనీలో కొన్ని ఇండ్లు నీట మునిగాయి. కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. హల్దీ వాగుకు వరద రావడంతో మెదక్ శివారులోని పసుపులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
పోచారం ప్రాజెక్టు నిండి..నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. మంగళవారం కల్లా నిండే చాన్స్ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేట, కామారెడ్డి, రాజంపేట, బీబీపేట మండలాల్లోని వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. పిట్లం,- బాన్స్వాడ మధ్య రాకపోకలు నిలిచాయి.