
- నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్స్ అమ్మకాలు
- డీసీఏ స్పెషల్ తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్స్ విక్రయిస్తున్న 66 మెడికల్ షాపులకు డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూకట్ పల్లిలోని ఓ ఫార్మసీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.70 వేలు విలువ చేసే మెడికల్ కిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ కొత్త డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ షానవాజ్ ఖాసీ పర్యవేక్షణలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ హాస్పిటళ్లు, వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపుల్లో తనిఖీలు ప్రారంభించారు. మొదటి రోజు తనిఖీల్లో భాగంగా 66 ఫార్మసీ షాపుల్లో అక్రమంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ డివైజ్ స్టాక్ ను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
కూకట్ పల్లిలోని రెమెడీ హాస్పిటల్ ఫార్మసీలో అక్రమంగా ఉంచిన బయోప్రో పీఆర్పీ కిట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిట్‌లు ఆల్కెమ్ డయాగ్నోస్టిక్స్, కోయంబత్తూర్ లో తయారు చేసినవిగా గుర్తించారు. ప్యాకేజింగ్‌పై ఒకే బ్యాచ్ నంబర్‌తో రెండు వేర్వేరు తయారీ, గడువు తేదీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కిట్ ల కొనుగోలుకు సంబంధించి ఫార్మసీ షాపు సరైన బిల్లులను కూడా చూపించలేదని డీసీఏ అధికారులు వెల్లడించారు. అలాగే, ఇతర మెడికల్ షాపుల్లో రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకుండా మందులు అమ్మడం, సరైన బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, థర్మోలాబిల్ డ్రగ్స్ (టెంపరేచర్ సెన్సిటివ్ మెడిసిన్) సరైన నిల్వ విధానాలు పాటించకపోవడం, గడువు ముగిసిన మందులను నిల్వ చేయడం, అమ్మడం, సేల్స్ బిల్లులు, పర్చేస్ బిల్లులు సరిగా నిర్వహించకపోవడం వంటి అక్రమాలకు పాల్పడిన ఫార్మసీలకు నోటీసులు ఇచ్చారు.
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీఏ అధికారులు వెల్లడించారు. అక్రమంగా మందుల తయారీ, నార్కోటిక్ డ్రగ్స్, సైకో ట్రోపిక్ డ్రగ్స్ ఇతర అక్రమ కార్యకలాపాల గురించి 1800-59 9-6969 నంబర్ ద్వారా తమకు తెలియజేయాలని ప్రజలకు అధికారులు సూచించారు.