ఢిల్లీ ప్రభుత్వం గత నెలలో దుమ్ము కాలుష్యంపై ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా రూ. 2.36 కోట్లు జరిమానాలు విధించగా.. 200కు పైగా షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే 48 నిర్మాణ స్థలాలను మూసేయాలని ఆదేశించింది. ఈ చర్యలు కేవలం పేరుకే పరిమితం కాకుండా కొలవగలిగే, సైన్స్ ఆధారిత అమలుతో కాలుష్యాన్ని ఎదుర్కోవాలనే ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు.
అయితే అక్టోబర్ 15 నుండి 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 1262 నిర్మాణ స్థలాలను చెక్ చేశారు. దింతో నిబంధనల ఉల్లంఘనలకు 200 పైగా స్థలాలకు షో-కాజ్ నోటీసులు, 48 స్థలాలను మూసివేత, 35 స్థలాలకు భారీ జరిమానాలు విధించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ప్రకారం మొత్తం రూ. 2.36 కోట్ల జరిమానాలు విధించగా... బారికేడింగ్ లేకపోవడం, దుమ్ము, ధూళిని నివారించకపోవడం, చెత్తను సరిగ్గా పారవేయకపోవడం, తప్పనిసరి పర్యావరణ రక్షణ చర్యలు తీసుకోకపోవడం వంటి ఉల్లంఘనల కారణం ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యలు
*747 నిర్మాణ ప్రాజెక్టులు DPCC దుమ్ము కాలుష్య నియంత్రణ స్వీయ-అంచనా పోర్టల్లో రిజిస్టర్ చేసింది. ఈ వ్యవస్థలో లైవ్ వీడియో పర్యవేక్షణ, PM2.5, PM10 సెన్సార్‌లను అనుసంధానించారు.
*రిజిస్టర్ కాని లేదా చట్టవిరుద్ధ నిర్మాణాలను గుర్తించడానికి DPCC బృందాలను నియమించింది. వీరు సర్వే చేసిన 4,881 ప్రాంతాలలో, 33 ఉల్లంఘనలు గుర్తించి వెంటనే చర్య తీసుకున్నారు.
*CAQM (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్) ఆదేశాల మేరకు డీజిల్ జనరేటర్ సెట్లపై DPCC తనిఖీలు చేస్తోంది. కాలుష్య పరిశ్రమలను పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు (PNG) వైపు మారమని ప్రోత్సహిస్తున్నారు.
*నిర్మాణ ప్రాజెక్టుల అధికారులకు వర్చువల్ శిక్షణ ఇచ్చారు ఇంకా MCD, PWD, DDA వంటి ప్రభుత్వ సంస్థలతో సమన్వయాన్ని పెంచారు.
*నగరం అంతటా 1,800 మందికి పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, 35 ప్రత్యేక DPCC బృందాలు పనిచేస్తున్నాయి.
* గుర్తించిన 62 ట్రాఫిక్ హాట్‌స్పాట్లలో దుమ్మును అరికట్టడానికి నీళ్లు చల్లడం, ఊడ్చే పనులను ముమ్మరం చేశారు.
