ఆకుకూరలు అనగానే మూతి తిప్పుకునేవాళ్లకు.. ఈ రెసిపీలు రుచి చూపిస్తే గిన్నెలో కూర పూర్తయ్యేవరకు వదలరు. తోటకూర, గోంగూర, మెంతికూరలతో అదిరిపోయే రెసిపీలతో ఈ వారం స్పెషల్స్.
ఈ వింటర్కి గట్ హెల్త్ కాపాడే పర్ఫెక్ట్ డైట్ వీటితో సాధ్యం. మరింకెందుకాలస్యం.. చకచకా రెసిపీలు చదివేసి.. వంటింట్లో ట్రై చేయండి.
మెంతికూర కిచిడీ
కావాల్సినవి:
- మెంతికూర: ఒక కట్ట,
- కందిపప్పు: అరకప్పు, బియ్యం,
- బటానీలు: పావు కప్పు,
- నీళ్లు: రెండున్నర కప్పులు,
- నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక్కో టేబుల్ స్పూన్,
- ఉప్పు : సరిపడా,
- పసుపు : పావు టీ స్పూన్,
- కరివేపాకు : కొంచెం,
- ఆవాలు, జీలకర్ర, నూనె : ఒక్కో టీస్పూన్, ఇంగువ : అర టీస్పూన్, ఎండుమిర్చి: రెండు
తయారీ: ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, ఇంగువ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. తర్వాత బియ్యం, కందిపప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. ఉప్పు వేశాక మరోసారి కలిపి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక మూత తీసి ఒకసారి కలపాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, తరిగిన మెంతికూర వేసి వేగించాలి. ఆ తర్వాత ఉడికించిన మిశ్రమాన్ని వేయాలి. దాంతోపాటు బటానీలు వేసి అవసరమైతే నీళ్లు పోసి కలపాలి. నూనె పైకి తేలేవరకు ఉడికిస్తే సరి.
గోంగూర పనీర్
కావాల్సినవి:
- గోంగూర : ఒక కట్ట,
- నూనె : పావు కప్పు,
- పసుపు, ఆవాలు, జీలకర్ర :
- ఒక్కోటి అర టీస్పూన్, ఎండు మిర్చి : మూడు, ఉల్లిగడ్డలు, టొమాటోలు : రెండేసి చొప్పున,
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్, ఉప్పు : సరిపడా, కారం : రెండు టీస్పూన్లు, ధనియాల పొడి, గరం మసాలా : ఒక టీస్పూన్, నీళ్లు : సరిపడా, పనీర్ ముక్కలు : 200 గ్రాములు
తయారీ: పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత గోంగూర వేసి మూతపెట్టి మగ్గించాలి. నూనె పైకి తేలాక గోంగూర మిశ్రమంలో టొమాటో గుజ్జు వేసి కలపాలి. కాసేపయ్యాక నీళ్లు పోసి తెర్లనివ్వాలి. ఆపై పనీర్ ముక్కలు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికిస్తే గోంగూర పనీర్ కూర రెడీ.
తోటకూర వేపుడు
కావాల్సినవి:
- తోటకూర: ఒక కట్ట, అలసందలు, పచ్చి కొబ్బరి ముక్కలు : ఒక్కోటి ముప్పావు కప్పు,
- పచ్చిమిర్చి : ఐదు, అల్లం : చిన్న ముక్క,
- నూనె : సరిపడా, ఆవాలు, మినప్పప్పు : ఒక్కో టీస్పూన్,
- ఎండు మిర్చి : రెండు, ఇంగువ : చిటికెడు, జీలకర్ర : పావు టీస్పూన్,
- ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు, పసుపు : అర టీస్పూన్, ఉప్పు : సరిపడా, కొత్తిమీర : కొంచెం
తయారీ: ప్రెజర్ కుక్కర్లో నానబెట్టిన అలసందలు వేసి నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తర్వాత ఇంగువ, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. మిక్సీజార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలి.
తోటకూర ఆకును తరిగి తాలింపులో వేసి కలపాలి. మూడు నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఉడికించిన అలసందలు వేయాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం వేసి కలపాలి. మూతపెట్టి ఐదు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర చల్లాలి.
