
- ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకపోతున్నరు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని దొంగల్లా దోపిడీ చేశారని మండిపాటు
- మహబూబ్‌నగర్ జిల్లాలో 30 విద్యుత్ సబ్ స్టేషన్లకు భూమి పూజ
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరుకు ఏం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 2015లో ప్రారంభించిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేటలో, జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో 33/11 కేవీకి సంబంధించి 28 విద్యుత్ సబ్ స్టేషన్లు, రెండు 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నిరుద్యోగులు, గిరిజనులు, మహిళల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రం మీద దొంగలు పడ్డట్లు అందినకాడికి దోపిడీ చేశారని, దయ్యాల్లాగా రాష్ట్రాన్ని పట్టి పీడించారని ఫైర్ అయ్యారు. ప్రజా పాలనలో పేదలు సంతోషంగా ఉండడం చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఉన్నది లేనట్లుగా చెప్పిందే చెబుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వాళ్లకు పదవుల మీద తప్ప.. ప్రజల మీద ప్రేమ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారని చెప్పారు. పాలమూరు ప్రాంతం సీఎం సొంత జిల్లా కావడం.. రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా కావడంతో ఇక్కడ విద్య, వైద్యం, ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్ననట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.