ఫామ్​హౌస్​లు కట్టుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదు

ఫామ్​హౌస్​లు కట్టుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదు
  •     ప్రజల సొమ్ము దోపిడీదారుల పాలైతోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •     ప్రభుత్వం ఉద్యోగ రూపకల్పన చేస్తలేదు: కోదండరాం 


ఫామ్ హౌస్ లు కట్టుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని.. సామాన్యుల విద్య, ఉద్యోగ, ఉపాధి కలలను నెరవేర్చేందుకు వచ్చానని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రఘు దేపాక రచించిన ‘తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. కులమతాల అతీతంగా జ్ఞాన సముపార్జన జరగాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృథా ఖర్చు చేస్తున్నారని, ఇవే డబ్బులు ఎడ్యుకేషన్‌ కోసం ఖర్చు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇజ్రాయిల్ దేశంతో పోటీపడేలా ఉండేదన్నారు. ప్రజల సొమ్మును మానవ వనరుల అభివృద్ధి కోసం కాకుండా దోపిడీదారుల చేతికి వెళ్లేలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అత్యవసరంగా జ్ఞాన యుద్ధం కావాలన్నారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదువు అనేది జీవన విధానంలో భాగం కావాలని, సమాజంలో చీకటి కోణాల వెనకున్న నిజాలను బయట ప్రపంచానికి తెలియజేయాలని కోరారు. 
65 వేల ఉద్యోగాలనే నింపుతరా?: కోదండరాం
ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేదే కాకుండా ఆత్మ గౌరవంతో జీవించేలా చేస్తుందని కోదండరాం  అన్నారు. అయితే రాష్ట్ర సర్కార్ మాత్రం ఉద్యోగాల రూపకల్పన చేయడం లేదన్నారు. ఉద్యోగాల కోసం స్టూడెంట్లు ఆత్మ బలిదానాలు చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రభుత్వ శాఖలలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 65 వేల జాబ్స్​కే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తున్నారన్నారు. దేశంలో లేని ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు.