భారత దేశంలోని పంచభూత లింగాల క్షేత్రాల్లో శ్రీకాళహస్తి దేవాలయం చాలా ప్రసిద్దిచెందింది. వాయు లింగేశ్వరుడుగా .. స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. రాహు, కేతు పూజలకు ప్రసిద్ధి చెందిన శ్రీ-కాళ-హస్తి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం లోపల ఇప్పటికే రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు.
ధ్వజస్తంభం, మహాద్వారం ప్రదేశాల్లో అద్దిన రంగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి పదో తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి, తిరుపతి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై సమీక్షించింది. ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి రోజు మాత్రమే లింగోద్భవ దర్శనంలో సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు. 18వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం రోజు బాల్యవివాహాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
దక్షిణకైలాసంగా పేరుపొందిన శ్రీకాళహస్తి పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆలయంలో విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే సంప్రదాయాలకు పెద్దపీట వేసినట్లు రూపుదిద్దుతున్నారు. ఆలయం అంతా రంగురంగుల ముగ్గుల మయం చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణలో చూడటానికి వేయి కళ్ళు చాలవన్నట్లు మారింది.
బిక్షాల గాలిగోపురానికి అమర్చిన 'ఓం నమఃశివాయ అనే నూయాన్ లైటింగ్ ఇటు తేరువీధి, అటు బజారువీధులను పాల వెలుగుల్లా మార్చేసింది. ఊరంతా పండగ అన్నట్లు మారింది. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఇఓ బాపి రెడ్డి సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించుకుంటూ శివరాత్రిని బ్రహ్మాండంగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల షెడ్యూల్
- 15న మహాశివరాత్రి,
- 16న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం,
- 17వ తేదీ అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణం,
- 19న గిరిప్రదక్షిణ,
- 21న పల్లకీసేవ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు
ఆయా రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఏడాది భక్తుల సందడితో కళకళలాడే శ్రీకాళహస్తి ఆలయంలో ఈసారి బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శివరాత్రి పర్వదినంతో పాటు జరిగే ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మునుపెన్నడు చేయని విధంగా దక్షిణ కైలాసముగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తి వైభవము దేశ వ్యాప్తంగా అందరూ ఆనందించేలా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆలయ ఈవో బాపి రెడ్డి గత ఏడాది చేసిన పనుల అనుభవం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు..
భక్తుల బస సదుపాయాలకు, సాంస్కృతిక వేదిక రూపకల్పనతో పాటు పార్కింగ్, సిసి కెమెరాల ఏర్పాటు, స్వర్ణముఖి నదిలో భక్తులకు స్నానాలు, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బందోబస్తుకు సంబంధించి వచ్చే సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
మహాశివరాత్రి కార్యక్రమాల వివరాలు
- ఫిబ్రవరి 10 : భక్తకన్నప్ప ధ్వజారోహణముతో ఉత్సవాలు ప్రారంభం
- ఫిబ్రవరి 11: శ్రీ స్వామీ అమ్మవార్ల ధ్వజారోహణము
- ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి సందర్భంగా నంది సేవ
- ఫిబ్రవరి 16 : రథోత్సవం & తెప్పోత్సవం
- ఫిబ్రవరి 17 : స్వామి వారి కల్యాణోత్సవం
- ఫిబ్రవరి 19: కైలాస గిరి ప్రదక్షిణము
- ఫిబ్రవరి 21: స్వామివారి పల్లకి సేవ
- ఫిబ్రవరి 22 : స్వామివారికి ఏకాంత సేవ
