గుంట నక్క అనే పేరు మాజీ మంత్రి హరీశ్ రావుకు సూటబుల్ కాబట్టే అలా పిలుస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. తాను ఊరికే ఎవరికి పేర్లు పెట్టనని.. హరీశ్ కు ఆ పేరు పక్కా సూట్ అవుతుంది కాబట్టే గుంట నక్క అని పేరు పెట్టినట్టు చెప్పారు కవిత.
ఫిబ్రవరి 6న మీడియాతో మాట్లాడిన కవిత..ఫిబ్రవరి 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన కవిత బాగ్ లింగంపల్లిలోని ఆర్ టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఉంటుందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
జీవన్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? అని ప్రశ్నించారు కవిత. జగిత్యాలలో జీవన్ రెడ్డి చాలా బలమైన నాయకుడని.. అప్పట్లో జీవన్ రెడ్డిని ఓడించటానికి తాము చాలా కష్ట పడ్డామన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేత జీవన్ రెడ్డి అని వెల్లడించారు కవిత. జీవన్ రెడ్డి పార్టీ మారుతాడనీ అనుకోవడం లేదన్నారు. సీనియర్ నాయకుడు, విలువలు కలిగిన మంచి వ్యక్తి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ పార్టీకి మైనస్ అవుతుందన్నారు. జీవన్ రెడ్డి BRS కు టచ్ లో ఉండొచ్చన్నారు కవిత.
