మన హనుమంతుడు నకిలీ దేవుడంట.. : నోరుపారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

 మన హనుమంతుడు నకిలీ దేవుడంట.. : నోరుపారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన టెక్సాస్ లీడర్  అలెగ్జాండర్ డంకన్ టెక్సాస్ లోని 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  అలెగ్జాండర్ డంకన్ హనుమాన్ విగ్రహాన్ని నకిలీ హిందూ దేవుడి విగ్రహం అని విమర్శిస్తూ, అమెరికా ఒక క్రైస్తవ దేశమని అన్నారు. టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ పట్టణంలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ, టెక్సాస్ లో నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాం ? మనది క్రైస్తవ దేశం" అంటూ  పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

మరొక పోస్ట్‌లో అతను బైబిల్‌ మాటలను ఉదహరిస్తూ "నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. నీవు ఏ రకమైన విగ్రహాన్ని లేదా ఆకాశంలో లేదా భూమిపై లేదా సముద్రంలో ఉన్న దేని ప్రతిమను తయారు చేసుకోకూడదు" అన్నారు. అలెగ్జాండర్ డంకన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) అతని వ్యాఖ్యలను "హిందూ వ్యతిరేక, విద్వేషపూరితమైనవి"గా అభివర్ణించింది. ఈ విషయంపై చర్య తీసుకోవాలని కోరుతూ HAF టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

►ALSO READ | రెండేళ్ల జైలు శిక్ష తర్వాత.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ బెయిల్‌పై రిలీజ్

అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు తమకి నచ్చిన మతాన్ని పాటించవచ్చని చాలా మంది నెటిజన్లు అలెగ్జాండర్ డంకన్‌కు గుర్తుచేశారు. "మీరు హిందువు కానంత మాత్రాన అది తప్పు కాదు. యేసు పుట్టకముందే వేదాలు వ్రాయబడ్డాయి. వాటి ప్రభావం క్రైస్తవ మతంపై కూడా ఉంది. కాబట్టి మీ మతానికి ముందున్న మతాన్ని గౌరవించి, దాని గురించి తెలుసుకోవడం మంచిది" అని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో అన్నారు. 2024లో ఆవిష్కరించిన 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అమెరికాలోని ఎత్తైన హిందూ విగ్రహాలలో ఒకటి. చిన్నజీయర్ స్వామీజీ ఈ విగ్రహాన్ని ప్రతిపాదించారు. ఇది దేశంలోనే మూడవ ఎత్తైన విగ్రహం.