సృష్టి కేసులో నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

 సృష్టి కేసులో నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ
  • పోలీసు ఎఫ్‌‌ఐఆర్‌‌ల దర్యాప్తు.. అన్ని ఆధారాలు సేకరణ
  • 2014 నుంచి శిశువుల అమ్మకాలు, అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు
  • సరోగసి పేరిట పాపకు 3.5 లక్షలు, బాబుకి 4.5 లక్షలు వసూలు
  • మొత్తం రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిన నమ్రత
  • ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారిక ప్రకటన 

హైదరాబాద్‌‌, వెలుగు: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు అత్లూరి నమ్రత (అలియాస్ పాచిపల్లి నమ్రత)ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌‌ కోసం అధికారులు ఆమెను చంచల్‌‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సరోగసీ పేరిట శిశువుల అమ్మకాలు, అక్రమ రవాణా

ఈడీ ప్రకారం..  నమ్రత హైదరాబాద్ గోపాలపురం కేంద్రంగా సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్  నిర్వహిస్తున్నారు. సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా శిశువులు అందిస్తామని నమ్మించి..తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా క్లినిక్‌‌లు ప్రారంభించారు. ఫెర్టిలిటీ సెంటర్ ఉద్యోగులు, బ్రోకర్లు, ఏజెంట్ల నెట్‌‌వర్క్‌‌తో అక్రమ సరోగసీ, శిశువుల అక్రమ రవాణా రాకెట్ రన్ చేశారు. నమ్రత ఉచ్చులో చిక్కి మోసపోయిన బాధితుల ఫిర్యాదుల మేరకు గతేడాది గోపాలపురం పోలీస్ స్టేషన్‌‌లో పలు ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదయ్యాయి. అప్పట్లో నమ్రత సహా ఆమె అనుచరులు, ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రత గతేడాది నవంబర్ 27న బెయిల్‌‌పై విడుదలయ్యారు. 

పోలీసు ఎఫ్‌‌ఐఆర్‌‌ల ఆధారంగా ఈడీ కేసు

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌ల ఆధారంగా  నమ్రతపై ఈడీ కేసు నమోదు చేసి, పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టింది. నమ్రత సహా అనుచరులను కస్టడీకి తీసుకుని విచారించింది. గోపాలపురంలోని సెంటర్‌‌తో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా 2014 నుంచి నమ్రత ఈ రాకెట్ నిర్వహిస్తోన్నట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. సరోగసీ పేరిట భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆడ శిశువుకు రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. చెక్కులు, నగదు రూపంలో రూ. 40 కోట్లకు పైగా  సేకరించారు.

ఈ మొత్తంలో కొంత ఏజెంట్లు, సబ్-ఏజెంట్లకు కమీషన్‌‌గా ఇచ్చారు. మిగిలినది అక్రమంగా రవాణా చేసిన శిశువుల తల్లిదండ్రులకు చెల్లించారు. సికింద్రాబాద్ క్లినిక్ లైసెన్స్ రద్దయినా విశాఖపట్నంలో కార్యకలాపాలు కొనసాగించారు. మున్సిపల్ అధికారులకు పంపిన బర్త్ రిపోర్టులను నకిలీ చేసినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఎట్టకేలకు  నమ్రత గురువారం ఈడీ అధికారులకు చిక్కింది. దీంతో ఆమెను చంచల్‌‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌‌కు తరలించారు.