
- హైదరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్ కేసులో మ్యూల్ అకౌంట్ల లింకులు
- రూ.2,000 కోట్లు క్రిప్టో, హవాలాగా మార్చి తరలించిన ఏజెంట్లు
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో కొట్టేస్తున్న రూ.వందల కోట్లు దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్లలో డిపాజిట్ అవుతున్నాయి. మ్యూల్ అకౌంట్ల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో పెద్ద మొత్తంలో దేశం దాటిస్తున్నారు. ఇలాంటిదే పారిమ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ ద్వారా కొల్లగొట్టిన రూ.2000 కోట్లు హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, జైపూర్, మధురై, సూరత్‌లోని మ్యూల్ అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయి.
ఈ మేరకు బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా హైదరాబాద్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది. అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. పారిమ్యాచ్ పేరుతో నిర్వహించిన బెట్టింగ్ యాప్‌పై 2024లో ముంబైలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
తమిళనాడులో నగదు విత్‌డ్రా.. హైదరాబాద్, ముంబైలో హవాలా..
ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టింది. పారిమ్యాచ్ బెట్టింగ్ యాప్ ద్వారా కొల్లగొట్టిన సొమ్మును సైబర్ నేరగాళ్లు పెద్ద సంఖ్యలో మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. మ్యూల్ అకౌంట్ల నుంచి అనేక రూపాల్లో మొత్తం రూ.2 వేల కోట్లు క్రిప్టో వాలెట్లలోకి తరలించారని ఆధారాలు సేకరించారు. ఇందులో కొంత మొత్తాన్ని తమిళనాడులోని ఏటీఎంలు, యూపీఐల ద్వారా నగదు విత్‌డ్రా చేయగా.. హైదరాబాద్, ముంబైకి చెందిన కొందరు ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్లు, డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు పెద్ద మొత్తంలో క్రిప్టో, హవాలా రూపంలో తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మొత్తం కుంభకోణంలో సంబంధం ఉన్నట్టు ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది ఏజెంట్ల వివరాలను సేకరిస్తున్నారు.