ఆర్టీసీకి రాఖీ ఆమ్దానీ.. మూడు రోజుల్లో రూ.6 కోట్ల అదనపు ఆదాయం

ఆర్టీసీకి రాఖీ ఆమ్దానీ.. మూడు రోజుల్లో రూ.6 కోట్ల అదనపు ఆదాయం
  • రోజుకు ఐదు లక్షల మంది ఎక్కువగా ప్రయాణం
  • రోజూ 4,650 స్పెషల్ బస్సులు నడిపిన ఆర్టీసీ 

హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 9 నుంచి 11 వరకు రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్టీసీకి రోజుకు రూ. 2 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సాధారణంగా మాములు రోజుల్లో రోజుకు రూ. 11 కోట్ల ఆదాయం వస్తుండగా ఆ మూడు రోజుల్లో మాత్రం రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి రాఖీ పండుగా వీకెండ్ లో రావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ సొంత ఊళ్లో రాఖీ పండుగ జరుపుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో బస్సు ప్రయాణం చేసే వారి సంఖ్య అంచనాలకు మించి పోయింది. 

శుక్ర, శని, ఆదివారాల్లో ఆర్టీసీకి మొత్తంగా రూ.39 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో రోజుకు రూ. 2 కోట్ల చొప్పున అంటే మూడు రోజులకు రూ.6 కోట్ల అదనపు ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. మాములు రోజుల్లో ప్రతి రోజు 59 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. రాఖీ సందర్భంగా ఆ మూడు రోజుల పాటు ప్రతి రోజు 64 లక్షల మంది ప్రయాణించారు. అంటే రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఆక్యూపెన్సీ రేషియో 120 దాటింది. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆ మూడు రోజుల పాటు 4 వేల 650 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడిపింది. 

రాఖీ సందర్భంగా మహిళలు మహాలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో చాలా బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేశారు. ప్రతి బస్సులో సీట్లు దొరక్క నిలబడి తమ గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ వంటి ప్రధాన బస్సు స్టేషన్లతో పాటు ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, నాగోల్, ఆరంఘర్ ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి. వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని బస్సు స్టేషన్లు కిటకిటలాడాయి.

రాఖీకి రికార్డు స్థాయిలో మహిళల ప్రయాణం

రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీలో మహిళలు రికార్డు స్థాయిలో ప్రయాణాలు చేశారు. ఈ నెల 9 న 45.62 లక్షల మంది, ఈ నెల 11న మరో 45.94 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒక్క రోజులో ఆర్టీసీ బస్సుల్లో ఇంత మంది మహిళలు ప్రయాణించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించింది. రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 12 వరకు మొత్తం ఆరు రోజులు 3.68 కోట్ల మంది మహిళలు రాకపోకలు సాగించగా, ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని సంస్థ తెలిపింది. 

గతేడాది రాఖీ సందర్భంగా 2.75 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా, ఈ ఏడాది 3.68 కోట్ల మంది బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 92.95 లక్షల మంది మహిళలు ఎక్కువగా ప్రయాణించారని ఆర్టీసీ తెలిపింది. కాగా, ఇంత మందిని క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో నిబద్ధతతో విధులను నిర్వర్తించిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లను మంత్రి   పొన్నం ప్రభాకర్​ అభినందించారు.

సాధారణ బస్సుల్లో చార్జీలు పెంచలే..

అయితే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేశామని, సాధారణంగా నడిచే బస్సుల్లో ఎలాంటి చార్జీలు పెంచలేదని, పాత చార్జీలే వసూలు చేశామని ఆర్టీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి పండగ సందర్భంలో స్పెషల్ బస్సులకు జీవో నెంబర్ 16 ప్రకారం 50 శాతం వరకు చార్జీలను పెంచుకునే అవకాశం 2003లో ప్రభుత్వం ఇచ్చిందని ఆర్టీసీ ప్రకటించింది. 

దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి వంటి వాటికి అదనపు చార్జీలను వసూలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాఖీకి వసూలు చేశామని వివరించింది. కాని కొందరు సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది సరైంది కాదని సంస్థ పేర్కొంది. తిరుగు ప్రయాణంలో జనం లేక బస్సులు ఖాళీగా వస్తుండడంతో డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణ కోసమే అదనపు చార్జీలను వసూలు చేయాల్సి వచ్చిందని తెలిపింది.