
- ఎల్పీజీకి రూ. 2.70 లక్షలు
- సీఎన్జీకి రూ. 2.80 లక్షలు
- తర్వాతే ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోల అమ్మకాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. డీలర్లు, షోరూమ్ నిర్వాహకులు కుమ్మక్కై ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆటో సంఘాలు ధర్నాలు చేయగా, ఆర్టీఏ ఓ పరిష్కార మార్గం చూపించింది. ఎల్పీజీ ఆటోల ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటోల రేటును రూ.2.80 లక్షలుగా నిర్ణయించారు. ఆటో సంఘాలు, ఆర్టీఏ కమిషనర్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఇక నుంచి ఈ ధరలే వర్తిస్తాయని, షోరూమ్ ల నిర్వాహకులు ఈ ధరలకే ఆటోలు అమ్ముతారని, దీనికి మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం10 వేల ఎల్పీజీ, మరో 10 వేల సీఎన్జీ ఆటోలకు పర్మిట్లు ఇస్తుండగా.. ముందుగా ఇవి అయిపోయిన తర్వాతే 20 వేల ఎలక్ట్రిక్ఆటోల పర్మిట్లను ఇవ్వాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకూ ఎల్పీజీ ఆటోలు రూ.2.35 లక్షల నుంచి రూ.2.40 లక్షలు ఉండగా దీనిని రూ.2.70 లక్షలుగా నిర్ణయించారు. సీఎన్జీ ఆటోలు రూ.2.40 లక్షల నుంచి రూ.2.45 లక్షలుండగా రూ.2.80 లక్షలుగా డిసైడ్చేశారు. గ్రేటర్పరిధిలో ఇప్పటివరకు ఎల్పీజీ, సీఎన్జీ కలిపి 18,790 ఆటో పర్మిట్లు జారీ అయ్యాయని జేటీసీ రమేశ్ తెలిపారు.