ఉప్పొంగిన వాగులు..ఆదిలాబాద్, ఆసిఫాబాద్జిల్లాలో భారీ వర్షం

ఉప్పొంగిన వాగులు..ఆదిలాబాద్, ఆసిఫాబాద్జిల్లాలో భారీ వర్షం
  • మంచిర్యాల, నిర్మల్​జిల్లాలోని పలు మండలాల్లోనూ..
  • జలదిగ్బంధంలో గ్రామాలు.. స్కూళ్లు బంద్
  • వట్టివాగు ప్రాజెక్టు కాలువకు గండి
  • నీట మునిగిన పంటలు
  • ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/తాండూరు/కడెం, వెలుగు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తోపాటు మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములో, మెరుపులతో కూడిన భారీ వర్షం, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ ​జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్, నాయికపు గూడ మధ్య వాగు ఉదృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దిందా వాగు ఉప్పొంగడంతో మానికి రాకపోకలు ఆగిపోయాయి. పెంచికల్ పేట్, బెజ్జూర్, దహెగాం మండలాల ప్రజలు వరదలతో అవస్థలు పడ్డారు. మల్లన్న వాగు పొంగి దహెగాం మండలంలోని వందల ఎకరాల్లోని పంటలు నీట మునిగిపోయాయి.

డోరుమల్లి వాగు పొంగి దుబ్బగూడ, జెండగూడ, దేవాజిగూడ, మొర్రిగూడ గ్రామాలతోపాటు రెబ్బెన మండల నంబాల వాగు ఉప్పొగడంలో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం కొమ్ముగూడ గ్రామ సమీపంలో వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు గండి పడింది. నీళ్లు వృథాగా పోతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే రిపేర్లు చేపట్టాలని కోరుతున్నారు.కుమ్రంభీం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. 

చెరువులు, వాగుల్లోకి పోటెత్తిన వరద

భారీ వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న జిల్లా రైతులకు ఈ వానలతో ఊరట లభించింది. చెరువులు, వాగుల్లోకి వరద పోటెత్తింది. జిల్లాలోని మత్తడి వాగు గేటు, సాత్నాల వాగు ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని కిందకు వదిలారు. సిరికొండ మండలంలోని చిక్ మెన్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ, సొనాల మండలాల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లకు డీఈవో ఖుష్బూ గుప్తా సెలవు ప్రకటించారు.

కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్ మహాజన్ సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి, ప్రస్తుత  పరిస్థితులపై సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి వస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 24,723 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో 3 గేట్లు ఎత్తి 18,307 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.