పేద స్టూడెంట్లకు  ఫ్రీ ఇంజనీరింగ్..వంద మంది ఫీజును భరించనున్న పాలమూరు ఎమ్మెల్యే

పేద స్టూడెంట్లకు  ఫ్రీ ఇంజనీరింగ్..వంద మంది ఫీజును భరించనున్న పాలమూరు ఎమ్మెల్యే
  • మెరిట్​ ఆధారంగా స్టూడెంట్ల ఎంపిక
  • నేటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ

మహబూబ్​నగర్, వెలుగు: వెనుకబడిన పాలమూరు జిల్లాలో నిరుపేద పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు అడుగులు పడుతున్నాయి. టెన్త్, ఇంటర్​ వరకే చదువుకొని.. ఆపై చదువులు చదువుకోవాలనుకుంటున్న వారి కలలు నెరవేరనున్నాయి. ఇందుకు మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తన సొంత నిధులను సమకూర్చనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని ఆల్​ మదీనా ఎడ్యుకేషనల్​ సొసైటీ ఆధ్వర్యంలో జీకే ఇంజనీరింగ్​ కాలేజీ ఏర్పాటుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ అకడమిక్​ ఇయర్​ నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే మహబూబ్​నగర్​ నియోజకవర్గంలోని పేదలు బీటెక్​ చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన నియోజకవర్గంలో బీపీఎల్​ కింద ఉన్న వంద మంది స్టూడెంట్లకు ఫ్రీగా ఇంజనీరింగ్​ సీట్లు ఇప్పించేందుకు ముందుకొచ్చారు. ఇందుకుగాను అప్లికేషన్లను ఆహ్వానించారు. గురువారం నుంచి ఈ అప్లికేషన్లను ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్, మహబూబ్​నగర్​ ఫస్ట్  ఆఫీసుల్లో అందుబాటులో ఉండనున్నాయి. 

మెరిట్​ ఆధారంగా ఎంపిక..

ఇంజనీరింగ్​ కాలేజీలో బీటెక్​లో చేరేందుకు మెరిట్​ ఆధారంగా అవకాశం కల్పించనున్నారు. సీఎస్ఈ, ఏఐ అండ్​ ఎంల్​ కోర్సుల్లో చేరేందుకు అప్లికేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్​లో స్టూడెంట్​కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చాలి. ఎప్  సెట్, జేఈఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్, మార్కులను మెన్షన్​ చేయాలి. ఇంటర్​ హాల్​ టికెట్​ నంబర్, ఏ సంవత్సరంలో పాస్​ అయ్యారనే తేదీని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, పర్సంటేజీ వివరాలు పొందుపర్చాలి. అప్లికేషన్​లో స్టూడెంట్​తో పాటు తల్లిదండ్రులు లేదా గార్డియన్​ సంతకం చేసిన డిక్లరేషన్​ పొందుపర్చాలి. అప్లికేషన్ల​ఆధారంగా వంద మందిని ఎంపిక చేసి, ఫ్రీగా ఇంజనీరింగ్​ కాలేజీలో జాయిన్​ చేస్తారు.

ఒక్క స్టూడెంట్  ఫీజు రూ.2.76 లక్షలు.. 

ఇంజనీరింగ్​ కాలేజీల్లో కన్వీనర్​ కోటా కింద ఇప్పటికే కౌన్సెలింగ్​ పూర్తయింది. ప్రస్తుతం మేనేజ్​మెంట్​ కోటా కింద కౌన్సెలింగ్​ ప్రారంభమైంది. మేనేజ్​మెంట్​ కోటా కింద ఈ కోర్సుల్లో చేరేందుకు ఒక స్టూడెంట్​ ఏడాదికి రూ.69 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నాలుగేండ్లకు గాను రూ.2.76 లక్షలు కాలేజీ ఫీజుగా చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం వంద మంది స్టూడెంట్లను ఫ్రీగా చదివించేందుకు దాదాపు రూ.2.76 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఎమ్మెల్యే సొంతంగా భరించనున్నారు. మిగతా డబ్బులు దాతల సహకారంతో సేకరించి విద్యార్థుల ఫీజును చెల్లించనున్నారు. 

ఎడ్యుకేషన్​ హబ్​గా మార్చాలన్నదే నా తాపత్రయం..

పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్​ హబ్, స్కిల్​ డెవలప్​మెంట్​ హబ్​గా డెవలప్​ చేయాలన్నదే నా తాపత్రయం. అందు కోసం టాస్క్​ సెంటర్​ను ఏర్పాటు చేశాం. ఇటీవల అమరరాజా కంపెనీ ఆధ్వర్యంలో మరో స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ను ప్రారంభించాం. ఈ సెంటర్​ ద్వారా మూడు నెలల్లో 200 మంది శిక్షణ తీసుకుంటారు. త్వరలో పాలమూరుకు పెద్ద కార్పొరేట్​ సంస్థలు రానున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంట్రెస్ట్​​ఉన్న ప్రతి స్టూడెంట్​ బీటెక్​ చదవడానికి సహకారం అందిస్తాం. పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ సామాజిక కార్యక్రమంలో భాగం కావాలి.–యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే