
- యూరియా కోటా.. ఈ నెలలోనూ కేంద్రం కోత!
- ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులు.. పంపింది 1.13 లక్షల టన్నులే
- ఏప్రిల్ నుంచి జులై వరకు 32 శాతం కట్
- కేంద్రం తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: పంటలకు ఎరువులు వేయాల్సిన కీలక నెల ఆగస్టులోనూ తెలంగాణకు సరఫరా చేయాల్సిన యూరియా కోటాలో కేంద్ర ప్రభుత్వం 35 శాతం కోత విధించింది. ఎక్కువ భాగం విదేశీ యూరియానే పంపుతుండటం, ఏ నౌకల్లో ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో చెప్పకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడ్తున్నది.
ఓవైపు యూరియా కోసం రైతులు ఎదురుచూస్తుంటే కనికరం చూపాల్సిన టైంలో కోత పెట్టడం ఏమిటని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తున్నట్లు చెప్పింది. కానీ, ఏప్రిల్ నుంచి జులై వరకు 32% కోత పెట్టింది. ఈ నాలుగు నెలల్లో 6.60 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన కేంద్రం.. 4.50 లక్షల టన్నులు సరఫరా చేసిందని, 2.10 లక్షల టన్నులు (32%) కోత పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఆగస్టులో ఇస్తామని చెప్పింది 1.70 లక్షల టన్నులైతే.. 1.13 లక్షల పంపింది. 57 వేల టన్నులు (35%శాతం) కోత పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ 10 వేల నుంచి 12 వేల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆగస్టులో పంటలకు యూరియా ఎక్కువ వేస్తారు. దీంతో ఆగస్టు నెలలో 3 లక్షల టన్నులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. దేశీయ యూరియా సరఫరా చేయాలని పదేపదే కోరింది. కానీ, విదేశీ యూరియాను పంపడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నది.
ఆటలాడుతున్నారు: మంత్రి తుమ్మల
తెలంగాణకు యూరియా సరఫరాలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదని, కేటాయించిన యూరియాలో కోతలు పెట్టడం ద్వారా రాష్ట్ర రైతులతో కేంద్రం క్రూరమైన ఆటలాడుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. రాష్ట్రం తరఫున ఎన్ని లేఖలు రాసినా, కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసినా, రాష్ట్ర అధికారులు నెలవారీ సమావేశాల్లో విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజకీయ ప్రకటనలు చేయడం తప్ప యూరియా సమస్యను పరిష్కరించడం లేదని అన్నారు.
“దేశానికి అన్నం పెట్టే తెలంగాణ రైతులను ఎరువుల కోసం నిలబెట్టడం బాధాకరం. కేంద్రం రైతు వ్యతిరేక ధోరణికి ఇదే నిదర్శనం. రైతుల హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తం” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పార్లమెంట్‌లో యూరియా సరఫరాపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, రాష్ట్రానికి కేటాయించిన మొత్తం కోటాను వెంటనే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.