అపార్ట్మెంట్లలో బతికే జనానికి మనసు అనేదే ఉండదా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

అపార్ట్మెంట్లలో బతికే జనానికి మనసు అనేదే ఉండదా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో అమలు చేస్తున్న రూల్స్ డెలివరీ బాయ్స్ పాలిట శాపంగా మారాయి. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడకూడదన్న రూల్ను మెజారిటీ అపార్ట్మెంట్ సొసైటీలు, గేటెడ్ కమ్యూనిటీలు అమలు చేస్తున్నాయి. ఈ కారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్తో పాటు కొరియర్ బాయ్స్ కూడా ఎన్నో ఫ్లోర్ నుంచి ఆర్డర్ చేసినా మెట్లు ఎక్కుతూ.. ఆయాసపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ రూల్పై తాజాగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కారణం నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోనే. అపార్ట్మెంట్లలో బతికే జనానికి మనసు అనేదే ఉండదేమోనని ఈ వీడియోపై కొందరు నెటిజన్లు స్పందించారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక డెలివరీ బాయ్ ఒక పెద్ద పార్శిల్ మూటను మోసుకుంటూ మెట్లు ఎక్కుతున్నాడు.

ఆ మూట సైజ్ చూస్తుంటే.. చాలా బరువు ఉంటుందని అర్థమవుతుంది. ఈ పార్శిల్ను లిఫ్ట్లో తీసుకెళ్లనివ్వకపోవడంతో మెట్లు ఎక్కుతూ సదరు డెలివరీ బాయ్ ఆరవ ఫ్లోర్ వరకూ మోసుకెళ్లాడు. అంత కష్టపడి మోసుకొచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లోకి వెళుతున్న సమయంలో పొరపాటున ఆ మూట డోర్కు తగిలింది. ఆర్డర్ చేసిన వాళ్లు అయ్యో పాపం అని అతనిపై జాలి చూపించాల్సింది పోయి.. ‘ఆరాంసే.. బీ కేర్ ఫుల్’ అని తమ పార్శిల్కు ఏమవుతుందోనని కంగారు పడటం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది.

‘పిల్ల జమీందార్’ సినిమాలో నానికి, అవసరాల శ్రీనివాస్కు మధ్య ఒక సంభాషణ ఉంటుంది. మనుషులను అభిమానించడానికి.. వస్తువులను వాడుకోవడానికి దేవుడు సృష్టించాడు. కానీ.. మనం వస్తువులను ప్రేమిస్తున్నాం.. మనుషులను వాడుకుంటున్నాం అని అవసరాల చెప్పిన మాట అక్షరాల నిజమని ఈ వీడియో చూశాక అనిపించిందని కొందరు నెటిజన్లు నిట్టూర్చారు. ఏదేమైనా.. డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియో మరోసారి సమాజం కళ్లకు కట్టింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాల్లో బతకడం గొప్ప కాదని.. సాటి మనిషి పరిస్థితిని చూసి పెద్ద మనసుతో స్పందించడం గొప్ప విషయం అని కొందరు నెటిజన్లు ఆర్డర్ చేసిన సదరు కస్టమర్కు హితవు పలికారు.