కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో యాపిల్ ఐఫోన్ల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ సంస్థకు, స్థానిక గ్రామ పంచాయతీకి మధ్య మొదలైన వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మల్టీనేషనల్ కంపెనీలకు, స్థానిక సంస్థలకు మధ్య తలెత్తే ఘర్షణలకు ఇది అద్దం పడుతోంది. పన్నుల ఎగవేత, భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘన, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వంటి తీవ్ర ఆరోపణలతో గ్రామ పంచాయతీ ఈ టెక్ దిగ్గజానికి నోటీసులు జారీ చేసింది.
దొడ్డగొల్లహళ్లి, అరువనహళ్లి గ్రామాల పరిధిలో సుమారు 5.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫాక్స్‌కాన్ తన భారీ ప్లాంట్లను నిర్మించింది. అయితే పంచాయతీ రికార్డుల ప్రకారం ఆ భూమి ఇప్పటికీ ఖాళీ స్థలంగానే ఉంది. అంటే ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభమైనా.. భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు వంటి ఎటువంటి పత్రాలను కంపెనీ సమర్పించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ పన్నులు ఎగవేస్తున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వంటి సంస్థలే పన్నులు కడుతుంటే, ఫాక్స్‌కాన్ ఎందుకు మొండికేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంలో మరో ప్రధాన అంశం స్థానికులకు ఉపాధి కల్పన గురించే. ప్లాంట్ ఏర్పాటు సమయంలో లోకల్ యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా కార్యకలాపాలు మొదలయ్యాక బయటి ప్రాంతాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూల పేరుతో స్థానిక యువతను పిలిచి, ఆ తర్వాత వారిని పక్కన పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో.. స్థానిక ప్రతినిధులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
దీనిపై 7 రోజుల్లోగా సరైన డాక్యుమెంట్స్ సమర్పించకపోతే కర్ణాటక గ్రామ స్వరాజ్ అండ్ పంచాయత్ రాజ్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ హెచ్చరించింది. మరోవైపు స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే ఈ వారం చివర్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఒక అంతర్జాతీయ సంస్థ స్థానిక నిబంధనలను గౌరవించకుండా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయ మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
