భార్య ఒడిలో పసి పాప ఉందని కూడా చూడకుండా.. నడిరోడ్డుపై మంచిర్యాల కానిస్టేబుల్ శాడిజం !

భార్య ఒడిలో పసి పాప ఉందని కూడా చూడకుండా.. నడిరోడ్డుపై మంచిర్యాల కానిస్టేబుల్ శాడిజం !

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీలో నివాసం ఉంటూ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న రవి ప్రసాద్ అనే కానిస్టేబుల్ ఆదివారం సాయంత్రం తన భార్యను చిత్రహింసలకు గురి చేసిన  ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒడిలో పసిపాప ఉన్నా కనికరం చూపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్ధనగ్న స్థితిలో సదరు కానిస్టేబుల్ కనిపించడంతో మద్యం మత్తులో భార్యకు నరకం చూపిస్తున్నాడని.. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కనీసం ఆమె ఒడిలో చిన్న పాప ఉందన్న స్పృహ కూడా లేకుండా అమానవీయంగా దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ కావడం గమనార్హం. అనుమానంతో, ఇతర కారణాలతో భార్యను వేధిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

సిద్దిపేట పట్టణంలో ఓ వ్యక్తి భార్య, బిడ్డపై కత్తితో దాడి చేసిన అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. భార్య చనిపోగా, మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దుల్మిట్ట మండలం బెక్కల్‌‌ గ్రామానిక చెందిన దున్నపోతుల ఎల్లయ్య భార్య శ్రీలత (32), కూతురు హర్షిత, కొడుకు అజయ్‌‌తో కలిసి పదేండ్లు సిద్దిపేటలో ఉన్నాడు. కొన్ని నెలల కింద కుటుంబంతో సహా హైదరాబాద్‌‌కు వెళ్లిన ఎల్లయ్య పది రోజుల కింద తిరిగి సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్‌‌లో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాడు.

భార్యపై అనుమానం పెంచుకున్న ఎల్లయ్య ఆదివారం రాత్రి మద్యం మత్తులో కత్తితో భార్య శ్రీలత గొంతు కోసిన అనంతరం కూతురు హర్షిత గొంతు సైతం కోసేందుకు ప్రయత్నించడంతో ఆమె అడ్డుకుంది. దీంతో రోకలిబండతో దాడి చేశాడు. హర్షిత కేకలు విన్న అజయ్‌‌ వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. కాలనీవాసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన ఎల్లయ్య గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు, పోలీసులు కలిసి ముగ్గురిని హాస్పిటల్‌‌కు తరలిస్తున్న సమయంలోనే శ్రీలత చనిపోగా.. హర్షిత, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి ముందు శ్రీలత, హర్షితకు పురుగుల మందు తాగించిన ఆనవాళ్లు సైతం ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.