
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయికి బానిసలైనవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈగల్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఎంత నిఘా పెట్టినా.. అడ్డుకట్టపడటం లేదు. డ్రగ్స్ కల్చర్.. పట్నం నుంచి పల్లెకు పాకింది. దీంతో మత్తు పదార్థాల వాడకాన్ని కట్టడి చేస్తూ.. వాటివల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈగల్ అధికారులు భావిస్తున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది యాంటీ డ్రగ్ సోల్జర్లను రంగంలోకి దించేందుకు కార్యాచరణ రూపొందించారు. 15 యూనివర్సిటీలతో పాటు 760 కాలేజీ క్యాంపస్‌లలో విద్యాసంస్థలు, ఎన్జీవోలు, ఆశావర్కర్లను భాగస్వాములను చేస్తున్నారు. వీళ్లంతా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం
డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతూనే.. ఈగల్ టీమ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చిలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 240 మందికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. విద్యాసంస్థల ప్రతినిధులు, లెక్చరర్లు పలు ఎన్జీవోలకు చెందిన 400 మందికి శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో 436 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో 40 వేల మంది స్టూడెంట్లను యాంటీ డ్రగ్ సోల్జర్లుగా తయారు చేశారు. కాలేజీలు, వారివారి కుటుంబాలు, స్నేహితులు, బంధువులు సహా నివాసం ఉండే కాలనీలు, గేటెడ్ కమ్యునిటీల్లో అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వాడకంతో కలిగే అనర్థాలపై ప్రచారం చేశారు.
సిబ్బందికి డ్రగ్స్ నివారణపై శిక్షణ
కాలేజీల యాజమాన్యాలు సహా ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బందికి డ్రగ్స్ నివారణపై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 1.30 లక్షల మంది ఎన్ఎస్ఎస్, 70 వేల మంది ఎన్‌సీసీ సభ్యులను యాంటీ డ్రగ్ సోల్జర్లు తీర్చిదిద్దుతున్నారు. వీరందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికే ఈగల్ టీం 148, లా అండ్ ఆర్డర్ పోలీసులు 590 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో 1,25,249 మంది స్టూడెంట్లకు డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 20,989 హైస్కూల్స్‌లో ప్రహరీ క్లబ్‌లు, 4,729 కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, గ్రామస్తులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను భాగస్వాములను చేశారు.
డ్రగ్స్ నియంత్రణ.. ప్రతి ఒక్కరి బాధ్యత
డ్రగ్స్ నియంత్రణ అనేది ప్రతీ ఒక్కరి బాధ్యత. యువత మత్తు మహమ్మారి ఉచ్చులో చిక్కకుండా తల్లిదండ్రులు, కాలేజీల లెక్చరర్లు చూడాలి. అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలి. డ్రగ్స్, గంజాయి డిమాండ్ తగ్గినప్పుడే సప్లయ్ ఆగిపోతుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సోల్జర్‌గా పనిచేయాలి. డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, సప్లయర్లు, కస్టమర్ల గురించి తెలిస్తే 1908 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలి.
- సందీప్ శాండిల్యా, డైరెక్టర్, టీజీ ఈగల్