అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం : పీయూష్ గోయల్

అమెరికా నుంచి  రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం  : పీయూష్ గోయల్

 

  • ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది..ఇంతకంటే ఎక్కువ దిగుమతులు అవసరం: గోయల్
  • ఇప్పటికే  ఏడాదికి రూ.4.5 లక్షల కోట్ల వస్తువులు కొంటున్నం
  • బోయింగ్‌‌‌‌కు పెట్టిన ఆర్డర్ల విలువ మరో రూ.4.5 లక్షల కోట్లు దాటింది
  • ఆయిల్, విమాన విడి భాగాల కొనుగోళ్లు పెంచుతామని వెల్లడి

న్యూఢిల్లీ:   ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా  అమెరికా నుంచి ఐదేళ్లలో  500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.45 లక్షల కోట్ల)  విలువైన వస్తువులను ఈజీగా కొనుగోలు చేస్తామని వాణిజ్య  మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పటికే అమెరికన్ కంపెనీలకు పెట్టిన ఆర్డర్లు ఇందులో కలిసి ఉంటాయని అన్నారు. ఇండియా ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల వైపు వెళుతోందని, దిగుమతులు మరింత పెరుగుతాయని చెప్పారు. కాగా, ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో భాగంగా  అమెరికా నుంచి ఆయిల్‌‌‌‌ కొనుగోళ్లను భారీగా పెంచాలని ఇండియా నిర్ణయించింది.   క్రూడాయిల్‌‌‌‌,  నేచురల్ గ్యాస్ (ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ), పీఎన్‌‌‌‌జీ ,  విమానాలు,  వాటి భాగాలు, ప్రీసియస్ మెటల్స్ (గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ వంటివి), టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌‌‌‌ కొనుగోళ్లను పెంచనుంది.   ఆయిల్ కొనుగోళు విషయంలో  ఏ కంపెనీ ఎంత కొనాలన్నది ప్రభుత్వం నిర్ణయించదని, అమెరికన్‌‌‌‌ సప్లయర్లు, ఇండియన్ బయ్యర్లు ఈ విషయాలను నిర్ణయించుకుంటారని గోయల్ అన్నారు.  అమెరికన్ సప్లయర్లు ఎక్కువ డిస్కౌంట్‌‌‌‌ ఇస్తే ఇక్కడి కంపెనీలు ఎక్కువ కొనుగోలు చేయొచ్చని  చెప్పారు.  ‘‘అమెరికా నుంచి ఏటా 40–50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.5 లక్షల కోట్ల) విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. ఈ నెంబర్ మరింత పెరుగుతుంది. అమెరికా టెక్ కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. 10 గిగావాట్స్ డేటా సెంటర్లు పుట్టుకొస్తాయి. వీటి కోసం ఎక్విప్‌‌‌‌మెంట్లు అవసరం. వీటిని అమెరికా సప్లయ్ చేయగలదు”అని వివరించారు.  

విమానాల కొనుగోళ్లు జూమ్‌

మనకు విమానాలు, ఇంజిన్లు, ఇతర పార్టులు అవసరం ఎక్కువగా ఉందని,  ఒక్క బోయింగ్‌‌‌‌తోనే 50 బిలియన్ డాలర్ల (రూ.4.5 లక్షల కోట్ల) ఆర్డర్లు ఉన్నాయని గోయల్ తెలిపారు. రానున్న ఐదేళ్ల కోసం ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోనే 80–90 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పెట్టామని, టాటా గ్రూప్ మరిన్ని విమానాలు కొనేందుకు రెడీ అవుతోందన్నారు. మరోవైపు స్టీల్ ఇండస్ట్రీ విస్తరిస్తోందని, కుకింగ్ కోల్ కోసం ఏటా 30 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు.  ‘‘భారతదేశం ప్రస్తుతం ఇతర దేశాల నుంచి  300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేస్తోంది. వీటిని అమెరికా నుంచి కూడా పొందొచ్చు. రాబోయే ఐదేళ్లలో ఈ దిగుమతులు  2 లక్షల కోట్ల డాలర్ల వరకు పెరుగుతాయని అంచనా. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్స్, హై-ఎండ్ మెషినరీ, డేటా సెంటర్ ఎక్విప్‌‌‌‌మెంట్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ కోసం అవసరమైన టెక్నాలజీ అమెరికా నుంచే వచ్చే అవకాశం ఉంది”అని ఆయన వివరించారు. అమెరికా ఉత్పత్తులపై భారతదేశం 18శాతం టారిఫ్ విధిస్తుండగా, చైనా ఉత్పత్తులపై 35శాతం, ఇతర ఆసియా దేశాలపై 19–40శాతం వరకు టారిఫ్‌‌‌‌లు ఉన్నాయి. దీని వల్ల భారత కంపెనీలు  తమ ఉత్పత్తులను తక్కువ రేటుకు  అమెరికా మార్కెట్లో అమ్మడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి వీలుంటుంది. టెక్స్‌‌‌‌టైల్స్, లెదర్, ఫుట్‌‌‌‌వేర్, హ్యాండీక్రాఫ్ట్స్, కెమికల్స్, జెమ్స్ అండ్‌‌‌‌ జ్యువెలరీ వంటి రంగాలకు ఇది లాభం చేకూరుస్తుంది.  డెయిరీ, జెనిటిక్ మాడిఫికేషన్ (జీఎం) ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ, సోయాబీన్‌, కార్న్ వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై భారతదేశం అమెరికాకు ఎలాంటి టారిఫ్ రాయితీలు ఇవ్వలేదు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు కూడా ఒప్పందంలో ఉన్నాయి.

తగ్గనున్న రష్యా ఆయిల్

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తోంది.  మాస్కోకి చెందిన రెండు కంపెనీలు రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌పై కిందటేడాది అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి  హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌), హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్‌‌‌‌ రష్యా ఆయిల్‌‌‌‌ను కొనడం తగ్గించేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ తాత్కాలికంగా  తన కొనుగోళ్లను ఆపగా, ఇక పూర్తిగా నిలిపేసే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌‌‌‌) తమ కొనుగోళ్లను తగ్గించుకోనున్నాయి. రోస్నెఫ్ట్‌‌‌‌కు వాటాలున్న నయార ఎనర్జీ మాత్రం తన కొనుగోళ్లను కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా రష్యా నుంచి రోజుకి 11 లక్షల నుంచి 12 లక్షల బ్యారెల్స్‌‌‌‌ను దిగుమతి  చేసుకుంటోంది. ఇది 2023 మేలో నమోదైన 21 లక్షల బ్యారెల్స్ పెర్ డే కంటే సగం తక్కువ.   రష్యా నుంచి కొనుగోళ్లు 10 లక్షల బ్యారెల్స్ పెర్ డేకి దిగొచ్చే అవకాశం ఉంది. రానున్న 6–8 వారాలకు సంబంధించిన అగ్రిమెంట్స్‌‌‌‌ను కంపెనీలు ఫాలో అవుతాయని, ఆ తర్వాత  కొత్త ఆర్డర్ల వాల్యూమ్‌‌‌‌ తగ్గొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.  కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో అమెరికా నుంచి 3.7 లక్షల బ్యారెల్స్ పెర్ డేను ఇండియా దిగుమతి చేసుకుంది.