తెలంగాణ రాష్ట్రమంతటికీ రెడ్ అలర్ట్..హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు కూడా..

తెలంగాణ రాష్ట్రమంతటికీ రెడ్ అలర్ట్..హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు కూడా..
  • జోరు  వానలు
  • రాష్ట్రవ్యాప్తంగా మత్తళ్లు దుంకుతున్న చెరువులు
  • నేడు, రేపు రాష్ట్రమంతటికీ రెడ్​ అలర్ట్​
  • హైదరాబాద్​ సిటీలోని అన్ని జోన్లకు కూడా..
  • మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లిలో 23.2 సెంటీ మీటర్ల వర్షం
  • 5 జిల్లాల్లోనూ భారీగా కురుస్తున్న వాన.. మీడియం ప్రాజెక్టులకు వరద 
  • గోదావరిలో పెరుగుతున్న ఫ్లడ్​.. కడెం నుంచి ఎల్లంపల్లికి ప్రవాహం 
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • 48 గంటల్లో మరింత బలపడే అవకాశం
  • మరో 5 రోజులు  భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా పడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో మీడియం ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరో 5 రోజులు  భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రాష్ట్రం మొత్తానికి  రెడ్​అలర్ట్‌‌ను​ జారీ చేసింది. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్​శాఖ హెడ్​ డాక్టర్​ కె. నాగరత్న వెల్లడించారు. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం  ఉన్నదని చెప్పారు. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని, ఆ అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఉన్నదని వెల్లడించారు. 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని, దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత 5 రోజుల వరకు వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పారు. కాగా, హైదరాబాద్​ సిటీలోని అన్ని జోన్లకూ ఐఎండీ రెడ్​ అలర్ట్‌‌ను జారీ చేయగా.. అత్యంత భారీ వర్షాలు సిటీ అంతటా పడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రభావం భారీగా ఉండే చాన్స్​ ఉందని వెల్లడించింది. 

హైదరాబాద్‌‌లో మోస్తరు వర్షం..

హైదరాబాద్​ సిటీలో బుధవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. అన్ని జోన్లలోనూ వర్షం కురిసింది. ఉదయం నుంచే సైబర్​సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో వాన పడింది. రాజేంద్రనగర్‌‌‌‌లో 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  దూద్‌‌బౌలిలో 4.5 సెంటీమీటర్లు, చందూలాల్​ బరాదరిలో 4.5, ఏక్తకాలనీలో 4.2, గచ్చిబౌలి స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ వద్ద 3.9, మైలార్‌‌‌‌దేవ్‌‌పల్లిలో 3.6, శారదమహల్‌‌లో 3.6, గోల్కొండలో 3.6, అత్తాపూర్‌‌‌‌లో 3.3, యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్‌‌లో 3.1, ఇందిరానగర్‌‌‌‌లో 3.1, షేక్‌‌పేటలో 2.8, నాంపల్లిలో 2.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  గురువారం మొత్తం సిటీలోని అన్ని జోన్లకు ఐఎండీ రెడ్​ అలర్ట్‌‌ను జారీ చేసింది. 

చార్మినార్, ఖైరతాబాద్​, కూకట్‌‌పల్లి, ఎల్‌‌బీనగర్​, సికింద్రాబాద్​, శేరిలింగంపల్లి జోన్లలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జోన్లలో శుక్రవారం, శనివారాలకుగానూ ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్‌‌ను జారీ చేసింది. వర్షాల ప్రభావంతో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ఇచ్చాయి. వర్షాలున్నాయని ముందు నుంచి అధికారులు అలర్ట్​లు జారీ చేయడం, బయటకు రావొద్దని సూచిస్తుండడంతో జనాలు కూడా పెద్దగా బయటకు రాలేదు.
దీంతో పీక్​ అవర్స్‌‌లోనూ ట్రాఫిక్​ సమస్యలు తలెత్తలేదు. మరో 3 రోజులపాటు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ఇటు ట్రాఫిక్​ పోలీసులు, హైడ్రా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. 

మీడియం ప్రాజెక్టులకు వరదపోటు 

స్థానికంగా భారీ, అతిభారీ వర్షాలు కురుస్తుండడంతో మీడియం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. చనకా– కొరాటా బ్యారేజీ వద్ద 22,249 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది. వట్టివాగుకు 11,500 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో కొనసాగుతున్నది. కుమ్రంభీం ప్రాజెక్టుకు 8,333 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 21,292 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 10.39 టీఎంసీలకుగానూ 5.78 టీఎంసీల నిల్వ ఉన్నది. పెద్దవాగు ప్రాజెక్టుకు 10,120 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది. మూసీలో 6,500 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్‌‌‌‌కు 10,418 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. పలు పెద్ద చెరువుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. 

గోదావరిలో స్వల్ప ప్రవాహాలు 

రాష్ట్రంలోని మేజర్​ ప్రాజెక్టులకూ వరద తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ఇన్నాళ్లూ గోదావరి ప్రాజెక్టులకు వరద పెద్దగా రాలేదు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో కడెం, ఎల్లంపల్లి సహా వివిధ  ప్రాజెక్టులకు వరద మొదలైంది. కడెం ప్రాజెక్టుకు 24,723 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. 18,307 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీజన్‌‌లో తొలిసారిగా 19,062 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.  మహారాష్ట్రలోని జైక్వాడితోపాటు ఇతర ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 12,769 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకుగానూ 45.16 టీఎంసీల నీళ్లున్నాయి.

మిడ్​మానేరుకు 11,314 క్యూసెక్కులు, లోయర్​ మానేరుకు 2,500 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉధృతి నిలకడగా కొనసాగుతున్నది. జూరాలకు 90 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా.. 91,340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,89,651 క్యూసెక్కులు వస్తుండగా.. 2,74,602 క్యూసెక్కులను వదులుతున్నారు. 

సాగర్‌‌‌‌కు 2,28,141 క్యూసెక్కుల ఫ్లడ్​ ఉండగా.. 2,69,445 క్యూసెక్కులను వదులుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 87 రిజర్వాయర్లలో 1,069.34 టీఎంసీలకుగానూ 750.27 టీఎంసీల నిల్వలున్నాయి. అందులో కృష్ణా పరిధిలోనే 30 రిజర్వాయర్లలో 649.53 టీఎంసీలకు 592.54 టీఎంసీలున్నాయి. గోదావరి బేసిన్‌‌లోని 57 రిజర్వాయర్లలో 419.81 టీఎంసీలకుగానూ 157.73 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.

వరంగల్‌‌లో వరదలోనే 30 కాలనీలు

గ్రేటర్‍ వరంగల్‍ సిటీ వరదల నుంచి ఇంకా తేరుకోలేదు. సోమవారం అర్ధరాత్రి దాటాక మూడున్నర గంటలపాటు దంచికొట్టిన వానకు వరంగల్‍ తూర్పు పరిధిలోని 30 లోతట్టు కాలనీలు నీటమునిగాయి. మంగళ, బుధవారాల్లోనూ వర్షం కురవడంతో వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీంతో బాధితులు దాదాపు 1,200 మంది  పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. డీకే నగర్‍, ఎంఎన్‍ నగర్‍, లెనిన్‍ నగర్‍, ఆగర్తల, శివనగర్‍, గిరిప్రసాద్‍ నగర్‍, సాయిగణేశ్‍ నగర్‍, ఎన్‍టీఆర్‍ నగర్‍, సంతోషిమాత గుడి ప్రాంతాల్లో ఇండ్లు, షాపుల్లోకి వరద పెద్ద ఎత్తున చేరింది. 

కాగా, వరంగల్‌‌లో వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.158 కోట్ల పనులు చేపట్టినట్టు గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍ గుండు సుధారాణి, కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ తెలిపారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ముంచెత్తే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ఆకేరు, మున్నేరు, పాలేరుకి వస్తుండడంతో సమీపంలోని కాలనీలను అప్రమత్తం చేశారు. వరదలపై ఖమ్మం కలెక్టరేట్‌‌లో 1077,  90632 11298 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు ప్రభావిత గ్రామం రాకాసి తండాను జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించారు.

జిల్లాల్లో దంచికొట్టిన వర్షం

మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్​, కరీంనగర్​, సిరిసిల్ల, హనుమకొండ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఆయా జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమినిలో 23.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

కుమ్రంభీం జిల్లా రెబ్బెనలో 20.3 సెంటీమీటర్లు, జయశంకర్​ జిల్లా చిట్యాలలో 18.1, మంచిర్యాల జిల్లా తాండూరులో 17.4, ములుగు జిల్లా మంగపేటలో 16.5, మంచిర్యాల నెన్నెల్‌‌లో 14.6, జానకాపూర్‌‌‌‌లో 13.7, జయశంకర్​ జిల్లా రేగొండలో 13.4, కుమ్రంభీం జిల్లా జంబుగలో 13, కుంచవెల్లిలో 12.8, గిన్నెదారిలో 12.7, సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరులో 12.1, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 12, కరీంనగర్​ జిల్లా పోంచంపల్లిలో 12, ములుగు జిల్లా వెంకటాపురంలో 11.7, సూర్యాపేట జిల్లా అలంగాపురంలో 11.6, కుమ్రంభీం జిల్లా వంకుళంలో 11.6, జయశంకర్​ జిల్లా చేల్పూరులో 11.2, కుమ్రంభీం జిల్లా దహెగాంలో 10.1, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌లో 10.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. 

మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం కూడా వర్షం తీవ్రత కొనసాగింది. కాగా, గురు, శుక్రవారాలకు రెడ్​ అలర్ట్​ను జారీ చేసిన ఐఎండీ.. ఆ తర్వాత 3 రోజులు ఆరెంజ్​ అలర్ట్​ను ఇష్యూ చేసింది. అయితే, వెదర్​ సిస్టమ్​లో మార్పులు జరిగితే అలర్ట్‌‌లు మారే అవకాశాలూ లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.