బాబోయ్.. పిస్తాహౌస్...! మనం ఇన్నాళ్లు తిన్నది ఈ బిర్యానీనా.. ?

బాబోయ్.. పిస్తాహౌస్...! మనం ఇన్నాళ్లు తిన్నది ఈ బిర్యానీనా.. ?
  • గోడలపై పాకురు.. అపరిశుభ్ర రిఫ్రిజిరేటర్లు 
  • కిచెన్లలో ఎలుకలు, బొద్ధింకలు
  • ‘నాన్ వెజ్’ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ 
  • తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్​
  • ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడైన నిజాలు  

 హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పిస్తా హౌస్ రెస్టారెంట్లలో మంగళశారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 25 రెస్టారెంట్లను చెక్​చేసి 23 చోట్ల శాంపిల్స్​సేకరించారు. 11 చోట్ల కిచెన్లు తడిగా ఉండడంతో పాటు ఇంకొన్ని చోట్ల పాకురు ఉన్నట్లు గుర్తించారు. మూతలు లేకుండా డస్ట్ బిన్లు ఉన్నాయని, డ్రైనేజీ నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని తేల్చారు. గోడలకు కూడా పాకురు ఉందని, విరిగిన టైల్స్, రిఫ్రిజిరేటర్లు శుభ్రం చేయకపోవడం, కిచెన్లలో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయని కిటికీలకు మెష్ లు లేకపోవడమే కాకుండా అపరిశుభ్రంగా ఉన్నాయని తేల్చారు. 

నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని, తుప్పు పట్టిన రిఫ్రిజిరేటర్​లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నారని, తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కట్​చేస్తున్నట్టు గుర్తించారు. ఆహార పదార్థాలు నేలపై నిల్వ చేయడంతో పాటు కోల్డ్ రూమ్ స్టోరేజీ టెంపరేజర్ రికార్డులు మెయింటెన్ చేయడంలేదని తెలుసుకున్నారు. తనిఖీల రిపోర్టులను ఆయా జోనల్ కమిషనర్లకు అందజేశారు. వీటి  ఆధారంగా జోనల్ కమిషనర్లు నోటీసులు జారీ చేయనున్నారు. శాంపిల్స్​రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.