హైదరాబాద్: దేశంలో ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక విద్యా, శాస్త్రీయ సంస్థల ఏర్పాటు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టికి నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 28) ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్రం వచ్చిన దగ్గరి నుంచి భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అవలంబించిన విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆధునిక భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు. ఆధునిక భారతదేశానికి పునాదులు వేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడడానికి నెహ్రూ వేసిన పునాదులే నేటికీ భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని పేర్కొన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించారని చెప్పారు.
►ALSO READ | ఫామ్‌హౌస్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్.. ఎందుకంటే..?
దేశ అభివృద్ధిలో నెహ్రూ పాత్ర మరవలేనిదని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి, శాంతియుత సహజీవనం కోసం నెహ్రూ అంకితభావంతో పనిచేశారన్నారు. అలీన విధానం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గౌరవాన్ని నెహ్రూ ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నేటి తరం నెహ్రూ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
