హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం (డిసెంబర్ 29) నుంచి తెలంగాణ శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌కు రావడం స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే కేసీఆర్ హైదరాబాద్ వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఓడిపోయిన కొన్ని రోజులకే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఫామ్ హౌస్‌లో జారి పడటంతో ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఆడప దడపా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.
►ALSO READ | దివంగత ప్రజానేత పీజేఆర్‌కు మంత్రి వివేక్ ఘన నివాళి
తాజాగా కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగా 2025, డిసెంబర్ 21న బీఆర్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కృష్ణా, గోదావరి జలాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
ఇన్ని రోజులు ప్రభుత్వానికి సమయం ఇచ్చామని.. ఇక చూస్తూ ఊరుకోమని.. ప్రభుత్వం తోలు తీస్తామంటూ తనదైన శైలీలో వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటానని.. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ హైదరాబాద్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
