అల్ఫ్రాజోలం కేసులో.. రూ.4.79 కోట్ల ఆస్తులు అటాచ్‌‌‌‌

అల్ఫ్రాజోలం కేసులో..  రూ.4.79 కోట్ల ఆస్తులు అటాచ్‌‌‌‌
  • తెలంగాణతో పాటు ఏపీలోనూ నిందితుల ఆస్తులు
  • నిరుడు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అల్ఫ్రాజోలమ్  తయారీ, విక్రయాల కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులకు చెందిన మొత్తం రూ.4.79 కోట్ల స్థిరాస్తులను బుధవారం తాత్కాలికంగా అటాచ్  చేశారు. ఈ వివరాలను ఈడీ హైదరాబాద్‌‌‌‌  జోనల్‌‌‌‌  కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కేసు నిందితులు గిర్మగౌని సుధీర్, బిశ్వేశ్వర్  సింగ్, రాజేశ్వర్  శర్మ జోషి, భవానిగరి ప్రభువర గౌడ్, గజ్జెల శ్రీశైలం గౌడ్  తదితరుల ఆస్తులను జప్తు చేశామని  తెలిపింది.సంగారెడ్డికి చెందిన గిర్మగౌని సుధీర్  గౌడ్‌‌‌‌ 2014 నుంచి తన సోదరుడు ప్రభువర గౌడ్, బావమరిది గజ్జెల శ్రీశైలం గౌడ్  సహాయంతో అల్ర్ఫాజోలం తయారీ, అమ్మకాలు జరిపేవాడు.

 వీరంతా అల్ర్ఫాజోలమ్ ను కల్లు వ్యాపారులకు విక్రయించేవారు. తర్వాత సుధీర్‌‌‌‌.. బిశ్వేశ్వర్  సింగ్  అనే వ్యక్తి  సహాయంతో ఈ అక్రమ వ్యాపారాన్ని విస్తరించాడు. 2023లో  సుధీర్ గౌడ్, బిశ్వేశ్వర్ సింగ్‌‌‌‌  పెద్దమొత్తంలో అల్ర్ఫాజోలం తయారీ కోసం రాజేశ్వర్  శర్మ జోషి అనే మరో వ్యాపారితో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌లోని బాచారంలో సాయిప్రియా కెమికల్స్  ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు.ఆ ఫ్యాక్టరీలో అల్ర్ఫాజోలమ్  తయారీ చేయడం ప్రారంభించారు. వచ్చిన ఆదాయాన్ని వాటాల్లో పంచుకునేవారు.

కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు

సుధీర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌  అల్ర్ఫాజోలమ్  దందాపై గతేడాది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్  కోణంలో దర్యాప్తు చేపట్టింది. నిందితులు అల్ఫ్రాజోలమ్  విక్రయాలతో వచ్చిన సొమ్మును బ్యాంకుఖాతాల్లో జమ చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. 2025 ఆగస్టు 21న ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో రూ.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 100 గ్రాముల బంగారు బిస్కెట్, సుమారు 2.996 కిలోల బరువున్న 17 వెండి బార్లు,  కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రూ.4.79 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్  చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.