ఇయ్యాల మళ్లీ కోర్టు ముందుకు కవిత .. మరిన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోరే చాన్స్​

ఇయ్యాల మళ్లీ కోర్టు ముందుకు కవిత .. మరిన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోరే చాన్స్​
  • కస్టడీ ముగియడంతో ప్రొడ్యూస్​ చేయనున్న ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీ ముగియనుండటంతో మంగళవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఆమెను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కస్టడీని మరిన్నిరోజులు పొడిగించాలని కోరే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్​ కు సంబంధించి ఈ నెల 15 న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది.

అనంతరం ఆమెను అరెస్ట్ చేసి, అదే రోజు రాత్రి ఢిల్లీకి తరలించింది. 16వ తేదీన సీబీఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 23తో ఆ కస్టడీ ముగియడంతో.. మరోసారి కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ పాత్రకు సంబంధించి 17 పేజీల అప్లికేషన్ దాఖలు చేశారు. ఇదే టైంలో బెయిల్ పిటిషన్ ను ఆమె తరఫు అడ్వకేట్​ కోర్టుకు అందజేశారు.

ఈడీ కస్టడీ ముగియగానే ఈ పిటిషన్ పై వాదనలు చేపట్టాలని కోరారు. అయితే.. కవితకు మరో 3 రోజుల కస్టడీని కోర్టు పొడిగించింది. మంగళవారం ఉదయం 11 గంటల లోపు తమ ముందు హాజరుపరచాలని అప్పుడే ఆదేశించింది‌‌‌‌. దీంతో కవితను కోర్టు ముందు హాజరుపరిచి.. కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు తెలిసింది. 

తెరపైకి మరిన్ని అంశాలు వచ్చే చాన్స్​

మంగళవారం కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైంలో కీలక అంశాలు తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. సేకరించిన అప్ డేట్స్ ను కోర్టులో వాదనల సందర్భంగా ఈడీ వెల్లడించనుంది. కవిత కస్టడీలో పేర్కొన్న అంశాలతో పాటు, ఆమె ఫోన్ నుంచి సేకరించిన వివరాలను బహిరంగ పర్చనున్నట్లు తెలిసింది. వీటితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి ఇటీవల రాబట్టిన వాంగ్మూలంలోని సమాచారాన్ని కూడా రిపోర్టులో పొందుపర్చనున్నట్లు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది.