రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్..రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్..రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు
  • రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు
  • జోగినపల్లి, వద్దిరాజు, బడుగుల పదవీకాలం పూర్తి
  • ఏప్రిల్ నెలాఖరుతో ముగియనున్న టెన్యూర్
  • కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒకటి దక్కే చాన్స్
  • హస్తం పార్టీలో ఆరుగురు ఆశావహులు
  • దేశ వ్యాప్తంగా 56 స్థానాలు.. ఏపీలో మూడు ఖాళీ
  • వచ్చే  నెల 8న నోటిఫికేషన్.. 27న పోలింగ్

ఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభలో ఖాళీ అవుతున్న 56 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ సీట్లు ఖాళీ అవుతాయి. అత్యధికంగా ఉత్తర  ప్రదేశ్ నుంచి 10 స్థానాలు ఖాళీ అవుతుండగా.. ఏపీ, తెలంగాణ నుంచి మూడేసి సీట్లు వెకెట్ కాబోతున్నాయి. రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు.. వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్​ కుమార్, ఏపీకి  చెందిన సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల టెన్యూర్ ముగియనుండటంతో రాష్ట్రంలోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15లోపు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని అదే నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కంచి వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్టు పేర్కొంది. 

కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1

ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా  ఖాళీ అవుతున్న ఎంపీ సీట్లలో రెండు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్ఎస్ కు దక్కనున్నది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి పోటీపడుతున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన వంశీచందర్ రెడ్డికి కల్వకుర్తి టికెట్ దక్కలేదు. ఆయన కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు రేణుకాచౌదరి, మధుయాష్కీగౌడ్, వీహెచ్, అద్దంకి దయాకర్ రేసులో ఉన్నట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తే మధుయాష్కీగౌడ్ కు లేదా వీహెచ్ కు దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడో సీటుపైనా కాంగ్రెస్ కన్ను

ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు ఒక ఎంపీ సీటు దక్కుతుంది. అయితే మూడో సీటుపైనా కాంగ్రెస్ కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారని సమాచారం. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో టచ్ లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వశం కానున్నాయి. 

బీఆర్ఎస్ నుంచి కవితకు చాన్స్!

బీఆర్ఎస్ కు దక్కాల్సిన ఒక ఎంపీ సీటును ఎమ్మెల్సీ కవితకు కేటాయించే సూచనలున్నాయి. వద్దిరాజు రవిచంద్రకు మరోమారు కొనసాగించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం రావచ్చు. అయితే రాజ్యసభ రేసులో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. వీళ్లిద్దరూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.