కమ్మరాయ నాలా కబ్జా !

కమ్మరాయ నాలా కబ్జా !
  • ముంపు భయంతో వణికిపోతున్న ప్రజలు
  • నాలాపై పెరుగుతున్న అక్రమ కట్టడాలు
  • పట్టించుకోని అధికారులు

వర్ని, వెలుగు : ఉమ్మడి వర్ని మండలంలో నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు అవస్థలు పడుతున్నారు.  సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టిపట్టనట్లుగా వ్యవహరించడం  ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. చందూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతం, నిజామాబాద్–వర్ని ప్రధాన రహదారి వద్ద ఉన్న కమ్మరాయ నాలాలపై అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. 

 బస్టాండ్ ప్రాంతంలో 40 ఫీట్ల వెడల్పు ఉన్న కమ్మరాయ కెనాల్ సగం వరకు ఆక్రమణలకు గురైంది. కెనాల్ పక్కన ఉన్న కొందరు భూ యజమానులు అక్రమంగా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్ట్ కింద మూడు మార్గాలు ఉండగా, అందులో రెండింటిని కబ్జాదారులు మూసివేయడంతో ఒకే మార్గం ద్వారా నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షం వస్తే వరద నీరు రోడ్లపైకి, ఇండ్లల్లోకి చేరుతోంది.

ఆక్రమణలే వరదలకు కారణం..

చందూరులోని ఊరచెరువు, ఊలకుంట చెరువు, పొలాల గుండా వచ్చే నీరు, మురుగు ప్రవాహం అంతా దశాబ్దాలుగా కమ్మరాయ కెనాల్ ద్వారానే పారుతోంది. గత రెండేళ్లుగా కెనాల్‌‌‌‌పై కట్టడాలు పెరగడంతో ముంపునకు గురవుతున్నామని బాధితులు చెబుతున్నారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చందూరులోని ఎస్సీ వాడ, ఎరుకలవాడ, సింగూరు కాలనీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, దుస్తులు, వస్తువులు దెబ్బతిన్నాయి. టీవీలు, ఫ్రిజ్‌‌‌‌లు, కూలర్లు పనికిరాకుండాపోయాయని బాధితులు వాపోతున్నారు. అధికారులు, నాయకులు నిరాశ్రయులైన వారికి తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రాణాలకంటే డబ్బు ముఖ్యమా ?

కమ్మరాయ కెనాల్‌‌‌‌పై వెలుస్తున్న అక్రమ కట్టడాల వల్ల ముంపునకు గురవుతున్నామని చందూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జీపీ సెక్రటరీ సాయిలును నిలదీశారు. మీకు డబ్బులే ముఖ్యమా.. ప్రజల ప్రాణాలకు విలువ లేదా.. అంటూ ఆగ్రహించారు.  సెక్రటరీ అనుమతులు ఇవ్వడం వల్లే కెనాల్ కబ్జా అవుతుందని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు మునిగాయని, సామగ్రి పనికిరాకుండా పోయిందని తెలిపారు. రాత్రి సమయంలో వరదలు వస్తే తమ పరిస్థితి ఏమిటనిసెక్రటరీని ప్రశ్నించారు.  సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌‌‌‌కు వినతిపత్రం సమర్పించారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలి..

చందూరులోని బస్టాండ్ ప్రాంతంలో కమ్మరాయ కెనాల్‌‌‌‌పై ఆక్రమణలను తొలగించి పరీవాహక ప్రాంతాన్ని రక్షించాలని ముంపు బాధితులు కోరుతున్నారు. ఇందుకోసం గ్రామంలో తిరుగుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ మధ్య వరద ప్రవాహమే కబ్జాల వల్ల కలిగిన నష్టానికి నిదర్శనం. ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకూడదంటే ఆక్రమణలు తొలగించాలని బాధితులు కోరుతున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన రాలేదని, కలెక్టర్‌‌‌‌ స్పందించాలని పరీవాహక ప్రాంతాల ప్రజలు వేడుకుంటున్నారు.