
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తుడిచి పెట్టుకుపోతుంది.. రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనుగడనే ప్రశ్నర్థకంగా విధ్వంసం జరుగుతుంది. అవును.. ఇప్పుడు అక్కడ పడుతున్న వర్షాలు, ప్రకృతి విధ్వంసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. 2025, జూన్ 19వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు అక్కడి ప్రకృతి ప్రళయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. 70 రోజుల్లోనే 45 క్లౌడ్ బరస్ట్ లు కుండపోత వర్షాలకు కారణం అయ్యాయి. అంతేనా 91 ఆకస్మిక వరదలు ఊర్లకు ఊర్లను ముంచేశాయి.. 105 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి పెను విధ్వంసాన్ని సృష్టించాయి.
దింతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని విపత్తు బాధిత ప్రాంతంగా ప్రకటించింది. కొద్దిరోజులుగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో రూ.3వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ఈ విధంగా ప్రకటన చేశారు.
సమాచారం ప్రకారం, వర్షాలు, వరదలు మొదలైనప్పటి నుండి అంటే జూన్ 19 నుండి ఇప్పటివరకు 161 మంది చనిపోగా, మరో 40 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఈ విపత్తులో క్లౌడ్ బస్ట్స్ (cloudbursts), ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం జరిగాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనలు, వాటర్, విద్యుత్ సప్లయ్ సిస్టం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వర్షాలు, వరదల వల్ల చంబా, మండి, కులు, సిమ్లా, కాంగ్రా, కిన్నౌర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాలలో సహాయక చర్యలకు ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి.
చంబాలోని భర్మౌర్ సబ్-డివిజన్‌లో మణిమహేష్ యాత్ర సమయంలో 16 మంది భక్తులు చనిపోయారు. వారిలో నలుగురి మృతదేహాలు ఇంకా చిక్కుకునే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారుతుందన్నారు.
ప్రతిపక్ష నేత జై రామ్ ఠాకూర్ భర్మౌర్‌లో ఇంకా 500 మందికి పైగా చిక్కుకుపోయారని, వారిని రక్షించడానికి రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్ కూడా ప్రధానిని కలిసి రూ.20వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ రాసిన లేఖ తనకు కూడా అందిందని ముఖ్యమంత్రి అన్నారు.