ఇథనాల్ కలిపితే పెట్రోల్ ధరలు తగ్గవు: పుకార్లపై క్లారిటీ ఇచ్చిన HPCL మాజీ బాస్...

ఇథనాల్ కలిపితే పెట్రోల్ ధరలు తగ్గవు: పుకార్లపై క్లారిటీ ఇచ్చిన  HPCL మాజీ బాస్...

భారతదేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడకంపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. దీనివల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మాజీ చైర్మన్ ఎంకే సురానా క్లారిటీ ఇచ్చారు. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.

ధరల లెక్కలు ఎలా ఉన్నాయంటే 
చైర్మన్ సురానా తెలిపిన వివరాల ప్రకారం.. చమురు కంపెనీలకు పెట్రోల్ కంటే ఇథనాలే ఎక్కువ ఖరీదవుతోంది. రిఫైనరీ దగ్గర పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ.53 మాత్రమే ఉంటుంది. ఇథనాల్ ధర లీటరుకు రూ.56.71 నుండి రూ.71 వరకు ఉంటుంది.

అంటే పెట్రోల్ కంటే ఇథనాల్ ధర ఎక్కువ కాబట్టి, దీనివల్ల రేట్లు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు హఠాత్తుగా పెరిగినప్పుడు.. ఇథనాల్ ధరలు స్థిరంగా ఉండటానికి సహాయపడతాయని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది
ఈ విషయమై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇథనాల్‌ను తయారు చేసే రైతులకు మంచి ధర ఇవ్వడం కోసం దాని కొనుగోలు రేటును ఎక్కువగా నిర్ణయించారు. కాబట్టి E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే చౌకగా ఏమీ ఉండదు. ఇథనాల్ కలపడం అనేది ధరలు తగ్గించడం కోసం కాదు.. విదేశాల నుండి మనం కొనుగోలు చేసే ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడం కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాజకీయంగా రేగిన దుమారం 
ఈ E20 పెట్రోల్ అంశంపై ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. E20 పెట్రోల్‌కు సపోర్ట్ చేయని పాత వాహనాల్లో దీనిని వాడటం వల్ల ఇంజన్లు పాడవుతున్నాయని, దీనిపై జనాలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : E20 పెట్రోల్ వివాదం: గ్రాండ్ విటారా కేసులో మారుతి కీలక నిర్ణయం.. 

పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్, E20 పెట్రోల్.. ఇలా రెండు ఆప్షన్లు ఉంచాలి. వాహనదారులకు నచ్చింది ఎంచుకునే అవకాశం ఇవ్వాలి.  అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధరను తగ్గించాలి అని కేజ్రీవాల్ డిమాండ్ చేసారు.