టెన్త్ స్టూడెంట్లకు సాయంత్రం స్నాక్స్

టెన్త్ స్టూడెంట్లకు  సాయంత్రం స్నాక్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లలోని టెన్త్ స్టూడెంట్లకు ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్1 వరకు అమలు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. మిడ్ డే మీల్స్ ఏజెన్సీల ద్వారా స్టూడెంట్లకు స్నాక్స్ అందించాలని అందులో పేర్కొన్నారు. ఒక్కో స్టూడెంట్ కు రోజూ రూ.15 విలువైన స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం బడ్జెట్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఖాళీ కడుపుతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి, టీచర్ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. రెండ్రోజుల కింద టెన్త్ పరీక్షలపై జరిగిన సమీక్షా సమావేశంలో స్నాక్స్ విషయమై విద్యాశాఖ అధికారులు చర్చించారు. పరీక్షలు ప్రారంభమయ్యే వరకూ స్టూడెంట్లకు సాయంత్రం స్నాక్స్ అందించాలని మీటింగ్ లో నిర్ణయించారు. 

రూ.9 కోట్లు ఖర్చు.. 

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,785 హైస్కూళ్లలోని 1,89,791 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 34 రోజులకు గాను రూ. 9,67,93,410 ఖర్చు కానుంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 13,994 మంది స్టూడెంట్లకు రూ.71.36 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 10,593 మందికి రూ.54.02 లక్షలు.. అత్యల్పంగా ములుగులో 1,291 మందికి రూ.6,58,410 ఖర్చు కానుంది. ప్రతి రోజూ అటుకులు, పునుగులు, శనగలు, పాలు లేదా చాయ్... ఇలా ఒక్కో రోజు ఒక్కో స్నాక్ స్టూడెంట్లకు అందించనున్నారు. స్టూడెంట్లకు స్నాక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓలకు డైరెక్టర్ సూచించారు. కాగా, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

1.80 లక్షల పిల్లలు మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే

కరోనా టైమ్​లో ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరిన స్టూడెంట్లను ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది. సకాలంలో పుస్తకాలు, యూనిఫాం ఇవ్వకపోవడంతో పాటు కనీసం టీచర్లనూ నియమించలేకపోయింది. దీంతో మళ్లీ ఆ స్టూడెంట్లంతా ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. 2020–21లో 27.99 లక్షల మంది పిల్లలు సర్కారు స్కూళ్లలో చదివితే, 2021–22లో ఆ సంఖ్య 30.78 లక్షలకు చేరింది. ఒకే ఏడాది ఏకంగా 2.79 లక్షల​ అడ్మిషన్లు పెరిగాయి. ఇవన్నీ దాదాపు  ప్రైవేటు విద్యా సంస్థలవే. అయితే  ఈ ఏడాది 28.97 లక్షల మంది మాత్రమే సర్కారీ బడుల్లో చదువుతున్నారు. దీంతో గతేడాది చేరిన వారిలో 1.80 లక్షల మంది మళ్లీ ప్రైవేటు బడుల్లోనే చదివినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో 2020లో 32.52 లక్షల మంది ఉంటే, 2021లో ఆ సంఖ్య 28.67 లక్షలకు పడిపోయింది. మళ్లీ ఈ విద్యా సంవత్సరం ప్రైవేటులో స్టూడెంట్ల 30.58 లక్షలకు పెరిగింది. అయితే సర్కారు నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్లు ప్రైవేటు బడుల్లోకి వెళ్లిపోయారని టీచర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి.

టెన్త్ స్పెషల్ క్లాసుల అబ్జర్వేషన్లకు 16 టీమ్స్

టెన్త్ పరీక్షలపై రాష్ట్ర విద్యా శాఖ ఫోకస్ పెట్టింది. ఈ నెల13 నుంచి మార్చి31 వరకు టెన్త్ స్టూడెంట్లకు నిర్వహించనున్న స్పెషల్ క్లాసులను అబ్జర్వు చేసేందుకు 16 టీములను ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. రెండు జిల్లాలకు ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయగా.. టీముల్లో ఎస్ఆర్జీ, ఎస్సీఈఆర్టీ, సీఎస్ఎఫ్, యూనిసెఫ్​సభ్యులను నియమించినట్లు తెలిపారు. వీరంతా  కేటాయించిన జిల్లాల్లో వారంలో కనీసం మూడు రోజులు పర్యటించాలని శ్రీదేవసేన సూచించారు.  పిల్లల భయాన్ని పొగొట్టేందుకు టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.