హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అక్రమ కట్టడాలను హైడ్రా జరుపుతున్న కూల్చివేతలపై హైకోర్టు పేరుతో నకిలీ నోటీసులు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కూల్చివేతల విషయంలో సీఎం, హైడ్రా కమిషనర్ ప్రత్యక్షంగా హైకోర్టులో విచారణకు హాజరు కావాలని సీజే బెంచ్ పేరుతో నోటీసులు ఉన్నాయి. 12 వ తేదీ(ఆదివారం) నోటీసులు జారీ చేసినట్లు గుర్తించిన కమిషనర్ ఫిర్యాదు చేశారు. నకీలీ నోటీస్ తయారు చేసి, వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో నోటీసులు షేర్ చేస్తున్న అకౌంట్లను పోలీసులు గుర్తిస్తున్నారు. ఫేక్ నోటీసులను నమ్మొద్దని హైడ్రా కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

