ఆర్​ అండ్​ ఆర్ ప్యాకేజీ ఇవ్వట్లేదన్న మనస్తాపంతో రైతు మృతి

ఆర్​ అండ్​ ఆర్ ప్యాకేజీ ఇవ్వట్లేదన్న మనస్తాపంతో రైతు మృతి
  • భూదాన్ భూములు గుంజుకుంటున్నరని సిద్దిపేట జిల్లాలో ఒకరు.. 
  • ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇయ్యట్లేదని యాదాద్రి జిల్లాలో మరొకరు గుండెపోటుతో మృతి 

గజ్వేల్/యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదరువుగా ఉన్న భూములను గుంజుకుంటోందన్న మనోవేదనతో ఒక రైతు.. రిజర్వాయర్ కోసం భూములను, ఇండ్లను సేకరించి తమకు సరైన పరిహారం, ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ ఇవ్వట్లేదన్న మనస్తాపంతో మరొక రైతు.. గుండె ఆగి చనిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లికి చెందిన రైతు క్యాసారం బీరయ్య(65), యాదాద్రి జిల్లా లప్ప నాయక్ తండాకు చెందిన రైతు ధీరావత్ జామ్లా నాయక్(75) గుండెపోటుతో మృతిచెందారు. గజ్వేల్ శివారులో ఉన్న 182 ఎకరాల భూదాన్ భూములను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం, ఇతర అవసరాలకు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాసారం బీరయ్య తనకున్న మూడెకరాల భూమి పోతుందన్న బాధతో మంచం పట్టాడు. శుక్రవారం రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం నోటీసులు కూడా ఇవ్వడంతో బీరయ్య ఆందోళనకు గురయ్యాడు. నోటీసులు అందుకున్న 2 గంటల తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. భూమి పోతుందని మనస్తాపానికి గురవడంతోనే గుండె ఆగి చనిపోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

సర్కార్ పట్టించుకోకపోవడంతో..  
బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు(లప్పనాయక్ తండా) 8 రోజులుగా రిజర్వాయర్ కట్టపై దీక్షలు చేస్తున్నారు. జామ్లా నాయక్ కూడా రోజూ దీక్షలో కూర్చున్నారు. ఇతని భార్య కొంతకాలం క్రితం చనిపోగా, నలుగురు కొడుకులు ఉన్నారు. వీరి ఐదెకరాల భూమి రిజర్వాయర్​లో మునిగింది. ప్రభుత్వం నుంచి పరిహారం పూర్తిగా అందలేదు. ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ అమలులోనూ జాప్యం జరుగుతోంది. దీంతో జామ్లా నాయక్ కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నారు. గురువారం కూడా దీక్షలో కూర్చున్నారు. రాత్రి భోజనం చేసి పడుకున్న  తర్వాత గుండెనొప్పి రావడంతో హైదరాబాద్​కు తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదన చెందడం వల్లే జామ్లా నాయక్ గుండెపోటుకు గురయ్యాడని తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ కట్టపై మృతదేహంతో ఆందోళన చేశారు. బాధిత కుటుంబాన్ని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు, నేతలు శ్రీనివాస్, నర్సింగరావు, శ్రీనివాస్ గౌడ్, బుజ్జి శంకర్ నాయక్, ఆలేరు కాంగ్రెస్ ఇన్​చార్జి అయిలయ్య పరామర్శించారు.