చర్చలు జరపకుంటే మనకూ గాజా గతే పట్టొచ్చు!: ఫరూఖ్ అబ్దూల్

చర్చలు జరపకుంటే మనకూ గాజా గతే పట్టొచ్చు!: ఫరూఖ్ అబ్దూల్

శ్రీనగర్ :  వివాదాలను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్‌‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకపోవడంపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. చర్చలు జరపకపోతే గాజాకు పట్టిన గతే మనకూ పట్టొచ్చని హెచ్చరించారు. మంగళవారం శ్రీనగర్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగు వారిని మార్చుకోలేమంటూ ఇండియా, పాకిస్తాన్ సంబంధాల గురించి గతంలో మాజీ ప్రధాని వాజ్‌‌పేయి చెప్పారు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అన్నారు. మరి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? చర్చలకు (ఇండియాతో) సిద్ధమని వాళ్లు చెప్తున్నారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుక్కోకుంటే.. గాజాలో పాలస్తీనియన్లకు పట్టిన గతే మనకూ పట్టొచ్చు’ అని అన్నారు.

ఆఫీసర్లను మార్చితే సమస్య పరిష్కారం కాదు

పూంచ్‌‌లో పౌరుల మరణాల కేసు విషయంలో ఆర్మీ అధికారులను మార్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. అమాయక ప్రజలు చనిపోయేలా ఆఫీసర్లు చిత్రహింసలు పెట్టడానికి కారణాలేంటని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూంచ్‌‌లో ఆర్మీ వెహికల్స్‌‌పై టెర్రరిస్టుల దాడి కేసులో ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఫరూఖ్ స్పందిస్తూ.. 8 మందిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టడంతో ముగ్గురు చనిపోయారని చెప్పారు. ‘‘జమ్మూకాశ్మీర్‌‌‌‌లో టెర్రరిజానికి ఆర్టికల్ 370నే కారణమని నాలుగేండ్ల కింద చెన్నై స్పీచ్‌‌లో కేంద్ర హోం మంత్రి అన్నారు. టెర్రరిజం అంతమవుతుందని, జమ్మూకాశ్మీర్‌‌‌‌లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కానీ టెర్రరిజం అంతం కాలేదు. శిక్షణ పొందిన టెర్రరిస్టులు చొరబడుతున్నారు. వాళ్లను పట్టుకోకుండా అమాయకులను టార్గెట్ చేస్తున్నారు” అని ఆరోపించారు.