నదిలో దొరికిన డాల్ఫిన్.. ఆ నలుగురూ వండుకుని తినేశారు..

నదిలో దొరికిన డాల్ఫిన్.. ఆ నలుగురూ వండుకుని తినేశారు..

దేశ రాజధానిలో ఇటీవల కురిసిన వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో నదీ ప్రవాహానికి కొట్టుకువచ్చిన ఓ డాల్ఫిన్ ఇటీవల మత్స్యకారులకు చిక్కింది. ఆ తర్వాత వారు దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి, వండుకుని తిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆ తర్వాత మత్స్యకారుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

జూలై 24న చైల్‌ ఫారెస్ట్‌ రేంజర్‌ రవీంద్రకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. మత్స్యకారులపై కేసు ఫైల్ చేశారు. నసీర్‌పూర్‌ గ్రామానికి చెందిన మత్స్యకారులు యమునా నదిలో ఈ నెల 22న ఉదయం చేపల వేటకు వెళ్తుండగా డాల్ఫిన్‌ వలలో చిక్కుకుందని పిప్రి స్టేషన్‌ అధికారి శ్రవణ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. వారు నది నుండి డాల్ఫిన్‌ను బయటకు తీసుకువచ్చి, అనంతరం వారు తమ భుజంపై ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ వారు దాన్ని వండుకుని తిన్నారు, సింగ్ చెప్పారు.

కొంతమంది బాటసారులు మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకువెళుతుండగా ఈ వీడియో షూట్ చేశారని ఫారెస్ట్ రేంజర్ తన ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రంజీత్ కుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.