- 104 ఏళ్ల సుదీర్ఘ జీవితం ప్రజాసేవకే అంకితం చేసిన కృష్ణమూర్తి
- .మగ్ధూంభవన్‌లో భౌతికకాయానికి కమ్యూనిస్టు నేతల ఘన నివాళి ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఐ సీనియర్ నేత ఏటుకూరి కృష్ణమూర్తి (104) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌కు తరలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు.
జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేశారని, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ, జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీనియర్ నేతలు కె.శ్రీనివాస్ రెడ్డి, కందిమళ్ల ప్రతాపరెడ్డి, సి.ఆర్.ఫౌండేషన్ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన కుమారుడు ఏటుకూరి శ్రీనివాసమూర్తి అంత్యక్రియలు పూర్తిచేశారు. 104 ఏండ్ల వయసులోనూ ఏటుకూరి ఉద్యమ ఉత్సాహాన్ని వీడలేదని నారాయణ అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా విశ్రాంత ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల సంఘాలను ఏకం చేసి హక్కుల సాధనకు కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన మరణాన్ని విషాదంగా కాకుండా, ఆయన నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలన్నదే ఏటుకూరి ప్రధాన ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఏటుకూరి కృష్ణమూర్తి సంపూర్ణ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ అన్నారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత భావితరాలకు మార్గదర్శకమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.
