హైదరాబాద్, వెలుగు : ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 4,510 బంక్‌ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగేవి. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, రేట్లు పెరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. శనివారం 8,489 కిలోలీటర్ల పెట్రోల్, ఆదివారం 7,750 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. మరోవైపు డీజిల్ శనివారం 10,556 కిలో లీటర్లు, ఆదివారం 9,392 కిలోలీటర్ల అమ్మకాలు జరిగాయి. సాధారణం కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతుండడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని ఆఫీసర్లు వివరించారు. ఏపీలో పెట్రోల్ బంక్‌ల మూసివేతపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్ష నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్.. డిమాండ్‌కు తగ్గట్లు సప్లై ఉండేలా చూడాలని ఆఫీసర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. కంపెనీలు, రిటైల్ ఔట్‌లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దన్నారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని సూచించారు. సోమవారం నాటికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పారు.

