గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ ఎదుట చైన్ స్నాచింగ్

గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ ఎదుట చైన్ స్నాచింగ్

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ ఎదుట ఓ యువతి మెడలో నుంచి చైన్​ను లాక్కెళ్లిన స్నాచర్ ను పోలీసులు గంటలో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఏపీహెచ్ బీ కాలనీలోని హాస్టల్ లో ఉండే గాయత్రి అనే యువతి టీసీఎస్ లో జాబ్ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆఫీసు అయిపోగానే డీఎల్ఎఫ్ రోడ్ మీదుగా హాస్టల్​కు నడుచుకుంటూ వెళ్తోంది. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే  స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాయత్రి మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కుని రాడిసన్ హోటల్ వైపు పారిపోయారు. బాధితురాలు వెంటనే గచ్చిబౌలి పీఎస్ లో కంప్లయింట్ చేసింది. పోలీసులు స్పెషల్ టీమ్స్​ను ఏర్పాటు చేసి స్నాచర్ల కోసం గాలించారు. 

డీఎల్ఎఫ్, రాడిసన్ హోటల్ మెయిన్ రోడ్ వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కొండాపూర్ లోని వైట్ రిడ్జ్ హోటల్ వద్ద నిందితులున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మహబూబ్​నగర్​ జిల్లా తిరుమలాయపల్లికి చెందిన సబావత్​ విజయ్​(19), మరొకరు మాదాపూర్ లోని ఖానామేట్ కు చెందిన గుర్రం జాన్(20)గా పోలీసులు గుర్తించారు. విజయ్ కొండాపూర్ లోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో కారు వాషింగ్ పనిచేస్తుండగా, జాన్ కిమ్స్ హాస్పిటల్ లో వ్యాలెట్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10 గ్రాముల గోల్డ్ చైన్, 2 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ ఎదుట, లా అండ్ ఆర్డర్ పీఎస్, మాదాపూర్ జోన్ డీసీపీ, ఏసీపీ ఆఫీసుకు దగ్గరలోనే చైన్ స్నాచింగ్ జరగడంతో చర్చనీయాంశంగా మారింది.