- 24 ఏండ్ల యువకుడికి కొత్త జీవితం
పద్మారావు నగర్, వెలుగు : సికింద్రాబాద్ గాంధీ దవాఖాన డాక్టర్లు అత్యంత అరుదైన ట్రాకియల్ రిసెక్షన్ అండ్ అనస్టమోసిస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏండ్ల విజయ్‌కుమార్‌కు కొత్త జీవితాన్ని అందించారు. గత ఆగస్టు 13న విజయ్‌కుమార్ గుర్తుతెలియని విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రైవేటు దవాఖానలో ట్రాకియోస్టమీ చేసినా, తర్వాత సబ్‌గ్లోటిక్ ట్రాకియల్ స్టెనోసిస్ అనే ప్రాణాంతక సమస్య తలెత్తింది. శ్వాసనాళం తీవ్రంగా కుచించుకుపోవడంతో నిమ్స్‌లో ట్రీట్మెంట్ చేసినా.. నయం కాలేదు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గాంధీ దవాఖానకు వెళ్లాడు. దీంతో ఈ నెల 12న సీటీవీఎస్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ జి. రవీంద్ర, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ భూపేందర్ సింగ్ రాథోడ్ నేతృత్వంలోని డాక్టర్లు త్రిభువన్ కుమార్, హర్షిత, రాజశేఖర్ క్లిష్టమైన ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. లక్షల రూపాయల ఖర్చయ్యే ఈ అరుదైన సర్జరీని ఉచితంగా చేసి అతడి ప్రాణాన్ని నిలిపారు. ప్రస్తుతం విజయ్‌కుమార్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర వైద్య బృందాన్ని అభినందించారు. రోగి కుటుంబం గాంధీ వైద్యులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
