బాల పురస్కారం–2023 అవార్డు అందుకున్న గౌరవి రెడ్డి

బాల పురస్కారం–2023 అవార్డు అందుకున్న గౌరవి రెడ్డి
  • అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 
  • ఆర్ట్స్ అండ్ కల్చర్ కేటగిరీలో అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి చెందిన గౌరవి రెడ్డి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి  బాల పురస్కారం–2023 అవార్డు అందుకున్నారు. గౌరవి రెడ్డి.. అతి చిన్న వయసు (17 ఏండ్లు)లో ఇంటర్నేషనల్​ డ్యాన్స్ కౌన్సిల్–2016కు నామినేట్ అయింది. ఆరు శాస్త్రీయ నృత్య శైలీలలో ఇంటర్నేషనల్ ​స్థాయిలో వివిధ వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ఇందుకు గాను ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. బాల పురస్కారం అవార్డు కింద సర్టిఫికెట్, మెడల్​తో పాటూ లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని రాష్ట్రపతి అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ చెస్​ ప్లేయర్​ కోలగట్ల మీనాక్షితో పాటు వివిధ కేటగిరీల్లో చిన్న వయసులోనే విశేష ప్రతిభ కనబర్చిన  మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి ఈ పురస్కారాలు అందుకున్నారు.

పిల్లలే దేశానికి అమూల్యమైన నిధి: ప్రెసిడెంట్​

పిల్లలు దేశానికి అమూల్యమైన నిధి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో బాల పురస్కారాలు అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. పురస్కార గ్రహీతలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. వీరంతా సమాజ నిర్మాణంలో, దేశ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ  మంత్రి స్మృతి ఇరానీ, సహాయ మంత్రి మహేంద్ర పాల్గొన్నారు.